ఎవ‌రు హీరోలు.. మ‌రెవ‌రు ద్రోహులు..!

ప్ర‌త్యేక హోదా ఉద్య‌మంలో ఎవ‌రికి వారు హీరోలుగా మారి.. ఎన్నిక‌ల్లో ల‌బ్ధి పొందాల‌నుకుంటున్నారు. జ‌నాల ముందు ఛాంపియ‌న్ అనిపించుకోవాల‌నుకుంటున్నాయి. వాటి ల‌క్ష్యం హోదా కాదు.. ఏడాదిలో జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌లు. విభ‌జ‌న అనివార్యం అని తెలిసినా 2013లో అడ్డుకుంటాం.. బిల్లు ఆపుతాం… ఆరు నూరైనా చ‌ట్టం చేయ‌కుండా.. స‌మైక్య రాష్ట్రాన్ని కాపాడతాం అని ప్ర‌జ‌ల‌ను మ‌భ్య‌పెట్టిన ఈ నాయ‌కులే ఇప్పుడు మ‌ళ్లీ హోదా సాధిస్తాం.. రాష్ట్రానికి న్యాయం చేస్తాం అంటున్నారు. జేడీ శీలం వంటి ఒక‌రిద్ద‌రు నాయ‌కులు విభ‌జ‌న అనివార్యం.. మ‌న హ‌క్కుల గురించి నిలదీద్దాం.. బిల్లులో వ‌చ్చేలా చేద్దామ‌ని చెప్పినా.. జ‌నాల‌ను సెంటిమెంట్ మాయ‌లో ప‌డేసి.. మిగ‌తా నాయ‌కులు ప‌బ్బం గ‌డుపుకున్నారు.  ఇప్పుడు కూడా జ‌నాల‌ను రెచ్చ‌గొట్టి సెంటిమెంట్ అస్త్రం ప్ర‌యోగించి మ‌ళ్లీ ఎన్నిక‌ల్లో గెల‌వ‌డం కోసం పార్టీలు, నాయ‌కులు నాట‌కాలు మొద‌లుపెట్టారు. నిజంగా రాష్ట్ర ప్ర‌యోజ‌న‌మే ల‌క్ష్యం అయితే ఉద్య‌మంలో ఏకాభిప్రాయం ఏది? హోదా కోసం ఉమ్మ‌డి కార్యాచ‌ర‌ణ ఏది? ఎవ‌రి ఎజెండా వారిదే.. ఎవ‌రి పొలిటిక‌ల్ వ్యూహం వారిదే. ఒక‌రు బీజేపీతో పొత్తు వ‌ద్ద‌నుకుంటే.. ఇంకొక‌రు కావాల‌ని వెంట‌ప‌డుతున్నారు. అంతా హోదా అంటారు… కానీ క‌లిసిక‌ట్టుగా ఇత‌ర ప్రాంతీయ పార్టీల మ‌ద్ద‌తు కూడ‌గ‌ట్టేందుకు ప్ర‌య‌త్నాలేవి.. పార్టీల‌కు, నాయ‌కుల‌కు కావాల్సింది అధికారం, ప‌ద‌వులు హోదా కాదు.. ఏపీలో ఉన్న రెండు పార్టీలే క‌లిసిక‌ట్టుగా లేవు.. మేం మ‌ద్ద‌తు ఎందుకివ్వాల‌న్న టిఆర్ఎస్ వంటి పార్టీల అబిప్రాయం వింటే ఏపీ నేత‌ల చిత్త‌శుద్ది బోధ‌ప‌డుతుంది. మ‌రి ద్రోహులు ఎవ‌రు? హీరోలు ఎవ‌రో తెలుసుకోవాల్సింది జ‌నాలే?

Recommended For You