ఆ డ్రామాలు వెగ‌టు పుట్టిస్తున్నాయి..?

అంత‌టా డ్రామాలు.. అడుగడుగునా హ‌డావిడి. ఏదో సాధించిన‌ట్టు.. మ‌రేదో ఘ‌న‌త అయిన‌ట్టు అంద‌రూ ఎవ‌రి స్థాయిలో వారు డ్రామాలు ఆడుతున్నారు. ఇదంతా అమ‌రావ‌తికి వ‌చ్చిన ఉద్యోగుల విష‌యంలో వినిపిస్తున్న వ్యాఖ్య‌లు. హైద‌రాబాద్ నుంచి ఉద్యోగులు రావ‌డం అనేది వారి బాధ్య‌త‌. పనిలో భాగం. దీనిని కూడా త్యాగం చేసినట్టు అటు ఉద్యోగులు, ఇటు ప్రభుత్వం చేసే హడావిడి యూత్ లో వెగటు పుట్టిస్తోంది. వేల‌కు వేలు వేత‌నాలు అందుకుంటున్నారు. అంత‌కుమించి విజ‌య‌వాడ రావ‌డానికి ఇంక్రిమెంట్లు, అద‌న‌పు హెచ్ఆర్ ఏలు తీసుకుంటున్నారు. ప్ర‌భుత్వం ఏమీ చేయ‌క‌పోయినా ముందుకొచ్చి కష్టంలో మేమున్నామంటూ చెట్టు కింద అయినా ప్ర‌జ‌ల‌కు సేవ చేస్తామ‌ని చెప్పాల్సిన ఉద్యోగులు గొంతెమ్మ కోరిక‌లు తీర్చుకుని వ‌చ్చి.. ఇప్పుడు ఏదో త్యాగం చేసిన‌ట్టు ఫోజులు కొడుతున్నారు. ఒక‌టికి రెండుసార్లు వ‌చ్చి చూసుకుని వెళ్లారు. కావాల్సిన స‌దుపాయాలు సూచించి వెళ్లారు. ప్ర‌భుత్వం అన్నీ స‌మ‌కూర్చిన త‌ర్వాతే కాదా వ‌స్తుంది. పైగా వారు సామానులు ఇంటి నుంచి తీసుక‌రావ‌డం లేదు. కార్యాల‌యం కంప్యూట‌ర్లు, ఫైల్స్ అన్నీ ప్ర‌భుత్వ‌మే త‌ర‌లిస్తోంది. అవి లేకుండా వ‌చ్చినా ప్ర‌భుత్వానికి న‌ష్ట‌మే.. ఉప‌యోగం లేదు. అంద‌కే ప్ర‌భుత్వం అన్నీ జాగ్ర‌త్త‌లు తీసుకుంది.

నిజాయితీగా వారు కోరుకోవాల్సింది రెండే.. ఒక‌టే త‌మ పిల్ల‌ల‌కు చ‌ద‌వులు మ‌ధ్య‌లో ఉన్నాయ‌ని.. లేదంటే భార్య‌భ‌ర్తలు ఉద్యోగులు అయితే ఉండే స‌మ‌స్య‌. వాటికి ప‌రిష్కారం చూపించ‌మ‌ని ప్ర‌భుత్వాన్ని అడిగితే స‌రిపోతుంది. అంత‌కుమించి వీరికి స‌మ‌స్య‌లు ఏముంటాయి. హైద‌రాబాద్‌లో ఉద్యోగం చేసినంత కాలం విజ‌య‌వాడే రాలేదా? ఇప్పుడే వ‌స్తున్నారా… లేక ఆస్తులు అలా వ‌దిలేసి వ‌స్తున్నారా.. అదేం కాదు. వాటిని అమ్ముకుంటారు.. లేదంటే అద్దెలు వ‌స్తాయి. అక్క‌డ వ‌చ్చే అద్దె ఇక్క‌డ క‌ట్టుకుంటారు. లేదంటే ప్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం క్వార్ట‌ర్స్ ఇవ్వాల్సిన వారికి ఇస్తుంది.

ఒక ఉద్యోగి ట్రాన్స్‌ఫ‌ర్ అయితే ఊరు విడిచిపోరా.. కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగులు రాష్ట్రాల స‌రిహ‌ద్దులు దాటి వెళ్ల‌డం లేదా.. ప‌క్కనే ఉన్న రాష్ట్రానికి అదీ సొంత రాష్ట్రానికి వ‌చ్చినంత మాత్రాన ఇంత సెంటిమెంట్ ఎఫెక్టులు జ‌నాల‌కు చూపించాలా. జ‌నాల్లో సానుభూతి కోసం ఉద్యోగులు ఇన్ని నాట‌కాలు ఆడాలా. ఏదో ప్ర‌పంచం క‌ష్టాల‌న్నీ త‌మ‌కే ఉన్న‌ట్టు.. అయినా త్యాగాలు చేసి వ‌చ్చామ‌ని మీడియా ముందు కొంద‌రు చెబుతంటే కంప‌రంగా ఉందని యూత్ మండిప‌డుతున్నారు. వాళ్ల‌కు అంత‌క‌ష్టంగా ఉండి సొంత రాష్ట్రం రావ‌డం ఇష్టం లేక‌పోతే త‌మ‌కు అవ‌కాశం క‌ల్పించాల‌ని అంటున్నారు. వాళ్లు వ‌దిలేసింది కార్యాల‌యం మాత్ర‌మే. వారంలో మూడు రోజులు హైద‌రాబాద్‌లోనే ఉంటారు. ఇప్ప‌టికే శ‌నివారం, ఆదివారం సెల‌వు ప్ర‌క‌టించారు. అంటే సోమ‌వారం మ‌ధ్యాహ్నం చేరుకుంటారు.. శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం నుంచి అందుబాటులో ఉండ‌రు. ఇదే జ‌రిగేది.. ప్ర‌భుత్వం ఇచ్చిన వెసుల‌బాటు ప్ర‌జ‌ల‌కు శాపంగా మారనుంది. రాష్ట్రం కోసం చంద్ర‌బాబునాయుడు 20గంట‌లు క‌ష్ట‌ప‌డుతున్న‌ట్టుగా కాక‌పోయినా.. వారంలో ఆరు రోజులు పూర్తిగా పాల‌న‌పై అధికారులు, ఉద్యోగులు దృష్టి పెట్టి ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉంటేనే నిజంగా ఉద్యోగులు చెబుతున్న మాట‌ల‌కు అర్ధం. లేదంటే అంతా డ్రామాలు.. నాట‌కాలుగానే చూడాలి. ప్ర‌భుత్వం కూడా ఉద్యోగుల విష‌యంలో అర్ధ రూపాయి ప‌నికి రూపాయి ఖ‌ర్చు చేస్తుంది. వారికి వేత‌నాలు వ‌స్తున్నాయి.. డిఏలు ఇస్తున్నారు. అన్నీ అన్నాయి. ఏమీ లేని రైతులు కాదు.. వారి ఖ‌ర్చుల‌ను వారే భ‌రించుకుని చేరుకోవాలి.. ఇంత‌కాలం హైద‌రాబాద్‌లో ఎలా ప‌నిచేశారో.. అలాగే ఇక్క‌డా చేయాల‌ని ఆదేశించాలి. అప్ప‌డే రాష్ట్ర ప్ర‌గ‌తి సాద్య‌మ‌వుతుంది.. లేదంటే అధోగ‌తి పాలవుతుంది.

Recommended For You

4,323 Comments