ఏపీ చంద్రుడికి చుక్క‌లు చూపిస్తున్నారా?

సీమ‌లో స‌ర్దుకుంది అనేలోగా ఉత్త‌రాంధ్ర‌లో ముస‌లం మొద‌ల‌వుతుంది… అక్క‌డ రాజీ చేస్తే కోస్తాలో రాజుకుంటుంది. ఇలా తమ్ముళ్లు చంద్ర‌బాబుకు చుక్క‌లు చూపిస్తున్నారు. ఇటీవ‌ల వ‌రుస ప‌రిణామాలు అధినేతకు నిద్ర‌ను దూరం చేస్తున్నాయి. అటు పార్టీ, ఇటు పాల‌న క‌త్తిమీద‌సాముగా మారింది. అప‌ర చాణ‌క్యుడుగా ముద్ర‌ప‌డ్డ చంద్ర‌బాబుకు సైతం చిరాకు తెప్పిస్తున్నాయి. ఎమ్మెల్సీ అయి ప‌ద‌వీ బాధ్య‌త‌లు తీసుకోక‌ముందే వాకాటి నారాయ‌ణ‌రెడ్డిపై సిబిఐ కేసులు ఇరుకున‌పెట్టాయి. దీంతో పార్టీ నుంచి స‌స్పెండ్ చేయాల్సి వ‌చ్చింది. ఇది ముగిసింది అనుకునేలోగా హైద‌రాబాద్‌లో భూముల కబ్జాల కేసులో ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి అరెస్టు అయ్యారు. ఇది చంద్ర‌బాబుకు ఊహించ‌ని షాక్‌. దీంతో స‌ర్దుబాటు ప్ర‌య‌త్నాలు చేసినా అప్ప‌టికే జ‌ర‌గాల్సిన న‌ష్టం జ‌రిగింది. ఇక దీన్నుంచి కోలుకోక‌ముందే ఉత్త‌రాంధ్ర మంత్రులు గంటా-అయ్య‌న్న‌పాత్రుల మ‌ధ్య ఆధిప‌త్య పోరాటంతో విశాఖ భూముల కుంభ‌కోణం లోకానికి తెలిసింది. ఇంత‌కాలం గుట్టుగా విచార‌ణ జ‌రుగుతున్న అక్ర‌మాలు పుట్ట లోతులు బ‌య‌ట‌కు వెలుగుచూశాయి. ప్ర‌తిప‌క్షాల‌కు ఆయుధంగా మారాయి. ఉత్త‌రాంధ్ర టెన్ష‌న్ నుంచి బ‌య‌ట‌ప‌డుతుండ‌గానే… రాయ‌ల‌సీమ‌లో వ‌ర్గ‌పోరు వీధికెక్కింది. శిల్పామోహ‌న్ రెడ్డి పార్టీ వీడి వైసీపీలో చేరారు. ఇంత‌కాలం భూమా కుటుంబానికి అండ‌గా ఉన్న ఏవీ సుబ్బారెడ్డి కూడా పార్టీ వీడ‌తానంటూ సంకేతాలు పంపారు. ఇవ‌న్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు మాజీ ఛీప్ సెక్ర‌ట‌రీ, బ్ర‌హ్మ‌ణ కార్పోరేష‌న్ ఛైర్మ‌న్ కృష్ణారావు వ్యాఖ్య‌లు రాజ‌కీయంగా ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తున్నాయి. మ‌రెలాంటి బాంబులు పేల్చుతారో అని ప్ర‌భుత్వం ఆందోళ‌నలో ప‌డింది. రాష్ట్ర విభ‌జ‌న స‌మ‌యంలో ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ప‌నిచేసిన ఆయ‌న అధికార‌పార్టీ లోతుపాతుల‌ను చ‌ర్చ‌కు పెడితే అది విప‌క్షాల‌కు ఆయుధంగా మారుతుంది. ఇటీవ‌ల రంజాన్ తోఫా, కేంటీన్లు, ఎన్టీఆర్ సుజ‌ల స్ర‌వంతి వంటి ప‌థకాలు ఘ‌నంగా ప్రారంభించారు. అయినా అవేమీ జ‌నాల్లోకి పోవ‌డం లేదు. వివాదాలు చంద్ర‌బాబు క‌ష్టాన్ని బూడిదలో పోసిన పన్నీరుగా మారుస్తున్నాయి.

Recommended For You

Comments are closed.