ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం మొద‌లైందా?

ఏపీ క‌మ‌ల‌నాథుల్లో కొంద‌రు అంత‌ర్గ‌తంగా ర‌గిలిపోతున్నారు. పార్టీ మార‌తానన్న క‌న్నా ల‌క్ష్మినారాయ‌ణ‌ను బ‌తిమిలాడి పార్టీలో ఉంచి.. అధ్య‌క్ష ప‌ద‌వి ఇచ్చింది అదిష్టానం. ఇదే పార్టీలో కొంద‌రికి గిట్ట‌డం లేద‌ట‌. మొద‌టి నుంచి పార్టీని న‌మ్ముకున్న త‌మ‌ని కాద‌ని.. కాంగ్రెస్ నుంచి వ‌చ్చిన‌ నాయ‌కుడ్ని హైలెట్ చేయ‌డం జీర్ణించుకోలేక‌పోతున్నార‌ట‌. ఇప్పుడు పార్టీ రెండు వ‌ర్గాలుగా విడిపోయింద‌ట‌. ఒక‌టి ముందు నుంచి పార్టీలో ఉన్న‌వారు.. రెండోది 2014 త‌ర్వాత పార్టీలో చేరిన నాయ‌క‌గ‌ణం. పాత‌కాపులు సైలెంట్ కాగా.. కొత్త నాయ‌కులు అదిష్టానం అండ‌తో దూకుడు పెంచారు. పార్టీ రాష్ట్ర‌ అద్య‌క్షుడిగా క‌న్నా త‌న‌దైన శైలి రాజ‌కీయం మొద‌లుపెట్టారు. ఇంత‌కాలం పార్టీ అధ్య‌క్షుడు నామ‌మాత్రంగా స‌మావేశాలు.. స‌మీక్ష‌లు చేప‌ట్టారు. కానీ క‌న్నా ప‌ద‌వి చేప‌ట్ట‌డంతోనే తెలుగుదేశం పార్టీపై విమ‌ర్శ‌ల‌తో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. ధ‌ర్నాలు, దీక్ష‌ల పేరుతో రాజ‌కీయంగా ఉనికిని చాటుతున్నారు. త‌న‌కున్న అనుభ‌వంతో పార్టీలో జోష్ నింప‌డానికి ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. అంతేకాదు.. అదిష్టానంతో నిత్యం ట‌చ్ లో ఉండి.. ఎప్ప‌టిక‌ప్పుడు అప్ డేట్స్ చేస్తున్నారు. పార్టీ భ‌విష్య‌త్తు కార్యాచ‌ర‌ణ‌పై నివేదిక అడిగిన వెంట‌నే నాలుగురోజుల్లో సిద్దం చేసిన క‌న్నా.. ఢిల్లీ వెళ్లి పెద్ద‌ల‌కు నివేదించారు. ప్ర‌ధాన‌మంత్రి మోడీని క‌లిసి రాష్ట్రంలో రాజ‌కీయాల‌పై చ‌ర్చించారు. అమిత్ షాతో గంట‌న్న‌ర‌కు పైగా స‌మావేశం అయ్యారు. జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ముర‌ళీధ‌ర్ రావుతో మూడు గంట‌లు స‌మావేశ‌మ‌య్యారు. ఇత‌ర ఎంపీలు, నాయ‌కుల‌తో చ‌ర్చించి రాష్ట్రంలో ప‌ర్య‌ట‌న‌లు జ‌రిపేలా ఒప్పించారు. అదిష్టానం వ‌ద్ద క‌న్నాకు ఇమేజ్ పెరుగుతోంది. కానీ రాష్ట్రంలోనే డ్యామేజీ అవుతోంది. ఇంత‌కాలం పార్టీ బాధ్య‌త‌లు చూసిన నాయ‌కులే కాదు.. తెలుగుదేశం యాంటీ వ‌ర్గంగా ముద్ర‌ప‌డ్డ‌ సోము వీర్రాజు వంటి వాళ్లు కూడా స‌హ‌క‌రించ‌డం లేదని తెలుస్తోంది. పాత కాపుల‌ను కాద‌ని.. కొత్త కొమ్ములే ఎక్కువా అంటూ దూరంగా ఉంటున్నారట‌. కొంద‌రు క‌న్నాకు అండ‌గా ఉంటున్నా… పాత‌నాయ‌కులు ఎవ‌రూ కూడా పార్టీ కార్య‌క్ర‌మాల్లో యాక్టీవ్ గా ఉండ‌డం లేదు. మ‌రి క‌మ‌ల‌నాథుల్లో అంతఃక‌ల‌హాలు స‌ర్దుమ‌ణుగుతాయా? లేక మ‌రింత పెరిగి పార్టీ దూకుడుకు క‌ళ్లెం వేస్తాయో?

Recommended For You