నారావారింట నలుగురు – జగన్‌ ఇంట ఐదుగురు

Andhra Pradesh Regional

ఏపీలో కుటుంబ రాజకీయాలు పెరుగుతున్నాయి. కుటుంబంతో ఉన్న రాజకీయబంధాన్ని ఆసరాగా చేసుకుని అదృష్టం పరీక్షించుకుంటున్నారు. పార్టీ అధినేతల కుటుంబాలు కూడా ఇందుకు భిన్నం కాదు.. టీడీపీ అధినేత చంద్రబాబు ఇంట ఈ సారి పోటీచేసేవారి సంఖ్య పెరుగుతోంది. అటు జగన్‌ కుటుంబంలోనూ ఇదే పరిస్థితి. పార్టీలక పెద్దదిక్కులుగా ఉన్నవారు… పెద్దసంఖ్యలోనే పోటీకి దించుతున్నారు. ముఖ్యమంత్రి నారా కుటుంబంలో ఇప్పటికే ముగ్గురు ప్రజాప్రతినిధులున్నారు. కుప్పం ఎమ్మెల్యేగా చంద్రబాబు, MLCగా లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇదే కుటుంబానికి చెందిన నందమూరి బాలకృష్ణ హిందూపురం ఎమ్మెల్యేగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో వీరంతా మళ్లీ పోటీకి రెడీ అవుతున్నారు. వీళ్లతో పాటు ఈ కుటుంబం నుంచి మరో నాయకుడు వస్తున్నారు. బాలకృష్ణ చిన్నల్లుడు. మాజీ ఎంపీ ఎంవీవీఎస్ మూర్తి మనవడు భరత్‌. విశాఖ నుంచి ఎంపీగా బరిలో దిగేందుకు రెడీ చేసుకుంటున్నారు. కుటుంబం నుంచి కూడా గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చినట్టు తెలుస్తోంది. దీంతో నారా, నందమూరి వియ్యంకుల కుటుంబం నుంచి నలుగురు బరిలో ఉంటున్నట్టే. వైసీపీ అధినేత జగన్ కుటుంబం నాలుగాకులు ఎక్కువే చదివింది. వైఎస్‌ కుటుంబం నుంచి మొత్తం ఐదుగురు 2014 ఎన్నికల్లో పోటీ చేశారు. విశాఖపట్నం లోక్ సభ నుంచి పోటీ చేసిన విజయలక్ష్మి మాత్రమే ఓటమి చెందారు. పులివెందుల నుంచి జగన్, కడప ఎంపీగా అవినాష్ రెడ్డి, జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి కమలాపురం ఎమ్మెల్యేగా, బాబాయ్ వైవీ సుబ్బారెడ్డి ఒంగోలు ఎంపీగా గెలిచారు. వీరంతా 2019 ఎన్నికల్లో ఏదోస్థానం నుంచి పోటీ చేయడం ఖాయం. గతంలో చిన్నాన వివేకానందరెడ్డి ఎంపీగా, ఎమ్మెల్సీగా పనిచేశారు. ఆయన కూడా ఈ సారి ఎమ్మెల్సీ లేదా ఎమ్మెల్యేగా పోటీకి రెడీ అవుతున్నారు. దీంతో మళ్లీ ఐదుగురు పోటీచేయడం ఖాయంగా కనిపిస్తోంది. షర్మిల కూడా రంగంలో దిగితే ఈ సంఖ్య మరింత పెరుగుతుంది. మొత్తానికి పార్టీలకు చెందిన అధినేతల కుటుంబాలు కూడా వారసత్వ రాజకీయాల్లో పోటీపడుతున్నాయి.

For Video: