హస్తానికి ప్ర‌తిపక్ష హోదా పోతుందా?

టీడీపీని దాదాపు ఖాళీ చేసిన‌ గులాబీ ద‌ళ‌ప‌తి

ఇప్పుడు కాంగ్రెస్ హోదాపై న‌జ‌ర్‌


సిఎల్పీ నాయకులు

తెలంగాణ‌లో టీడీపీని దాదాపు ఖాళీ చేసిన గులాబీ బాస్‌.. ఇప్పుడు కాంగ్రెస్‌పై న‌జ‌ర్ పెట్టారా? ప‌్ర‌ధాన ప్ర‌తిపక్షంగా ఉన్న హ‌స్తం పార్టీకి ఆ హోదా లేకుండా చేయాల‌ని భావిస్తున్నారా? ఇదే ఇప్పుడు రాజ‌కీయ వ‌ర్గాల్లో ఆస‌క్తిక‌ర‌ చ‌ర్చ జ‌రుగుతుంది. తాజాగా మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాకు చెందిన మ‌క్త‌ల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే చిట్టెం రాంమోహ‌న్ రెడ్డి కారెక్కారు. ఈ అనూహ్య ప‌రిణామంతో కాంగ్రెస్ వ‌ర్గాలు విస్మ‌యం వ్య‌క్తం చేస్తున్నాయి. మ‌రికొంద‌రు కూడా కేసీఆర్‌తో ట‌చ్‌లో ఉన్నారంటూ ప్ర‌చారం జ‌రుగుతోంది. క‌నీసం న‌లుగురిని టార్గెట్ చేసిన‌ట్టు టిఆర్ఎస్ వ‌ర్గాలంటున్నాయి. అదే క‌న‌క జ‌రిగితే కాంగ్రెస్‌కు క‌ష్టాలే అంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదా గోవిందా అని హెచ్చ‌రిస్తున్నారు.
సాధార‌ణ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ త‌ర‌పున‌ 20 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. మ‌రో ఇండిపెండెంట్ కూడా మ‌ద్ద‌తు ఇచ్చారు. దీంతో పార్టీ బ‌లం 21కి పెరిగింది. ఆత‌ర్వాత టిఆర్ఎస్ చేప‌ట్టిన ఆప‌రేష‌న్ ఆక‌ర్శ్‌లో భాగంగా న‌లుగురు జెండా మార్చారు. దీంతో బ‌లం కాస్తా 17కు త‌గ్గింది. నారాయ‌ణ్‌ఖేడ్ ఎమ్మెల్యే కిష్టారెడ్డి మ‌ర‌ణంతో మ‌రొక‌రు త‌గ్గారు. ఎన్నిక‌లు జ‌రిగినా టిఆర్ ఎస్ గెల‌వ‌డంతో బ‌లం 16కు ప‌డిపోయింది. ఇటీవ‌ల పాలేరు ఎమ్మెల్యే రాంరెడ్డి వెంక‌ట‌రెడ్డి కూడా అనారోగ్యంతో చ‌నిపోయారు. ఇప్పుడు మ‌క్త‌ల్ ఎమ్మెల్యే పార్టీ ఫిరాయించారు. దీంతో కాంగ్రెస్ బ‌లం ఏకంగా 14కు ప‌డిపోయింది. అసెంబ్లీలో ప్ర‌స్తుతం ఉన్న సీట్ట్లు 119. ప్ర‌తిప‌క్ష హోదా కావాలంటే మొత్తం సీట్ల‌లో 10శాతం ఎమ్మెల్యేలు ఉండాలి. అంటే 12 మంది ఎమ్మెల్యేలు ఉంటేనే ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదా నిల‌బ‌డుతుంది. 14 మంది మాత్ర‌మే ఉన్న కాంగ్రెస్ పార్టీ నుంచి మ‌రో ఇద్ద‌రు ముగ్గురు పార్టీ ఫిరాయిస్తే పార్టీ ప‌రిస్థితి తారుమారు అవుతుంది. జానారెడ్డికి ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత‌గా కేబినెట్ హోదా పోతుంది. సిఎల్పీ నేత‌గానే మిగులుతారు. మ‌రి కాంగ్రెస్ మిగిలిన స‌భ్యుల‌ను అయినా కాపాడుకుంటుందా?
లేదంటే ప్ర‌త్య‌క్షంగానో… ప‌రోక్షంగానో త‌మ‌కు స‌హ‌క‌రిస్తున్న జానారెడ్డికి పెద్ద‌వాడిగా గుర్తించి ఉన్న ప‌ద‌విని కేసీఆర్ కాపాడ‌తారా?

Recommended For You

Comments are closed.