హరీష్‌ను తిడితే జగ్గారెడ్డికి టిఆర్ఎస్‌లోకి ఎంట్రీ వస్తుందా?

జగ్గారెడ్డి రూటు మార్చారా? టిఆర్ఎస్‌ లో చేరేందుకు ఆయన చేయని ప్రయత్నం లేదనిపిస్తోంది. ప్రగతిభవన్‌ నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ రావడం కోసం నానాపాట్లు పడుతున్నట్టు కనిపిస్తోంది. ఇటీవల మీడియాతో చిట్‌ చాట్‌ లో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇందుకు నిదర్శనం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. తాను కేసీఆర్‌ , కేటీఆర్‌ లకు వ్యతిరేకం కాదని.. వారి పనితీరు అధ్బుతంగా ఉందని.. హరీష్‌ రావు మంత్రిగా ఉన్నప్పుడు చేసిన పనులనే తాను విమర్శిస్తున్నాననడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అంటే ప్రస్తుతం హరీష్‌ రావును టార్గెట్‌ చేసి…కేటీఆర్‌ కు దగ్గరయ్యేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. టిఆర్ఎస్‌ లో ఎంట్రీ ఉండాలంటే ఇప్పుడు హరీష్‌ రావును ఏకిపారేయాలన్న ఫార్ములా జగ్గారెడ్డి అప్లై చేస్తున్నారు. మరి ఇది కేటీఆర్; కేసీఆర్‌ వద్ద పనిచేస్తుందా అన్నది ఆసక్తిగా మారింది. వాస్తవానికి మంత్రిగా గతంలో హరీష్‌ రావు సొంతంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు.. అంతా మామ కనుసన్నల్లోనే నడిచారు. ఆయన ఏం చెబితే సరే మామ అనడమే హరీష్‌ రావు చేసింది. కాకపోతే అల్లుడిగా ఆయనకున్న పరపతి నేపథ్యంలో కాస్త ఎక్కువ ప్రాధాన్యత లభించింది. ఇప్పుడు పార్టీలో కేటీఆర్‌ కీలకంగా మారారు. హరీష్‌ రావు అవసరం పెద్దగా లేదు. అందుకే కేసీఆర్‌ కూడా అల్లుడ్ని పక్కనపెట్టి.. బాధ్యతలన్నీ కేటీఆర్‌ పై పెట్టారు. దీనిని జగ్గారెడ్డి తనకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. పార్టీలో చేరేందుకు వారి ప్రాపకం కోసం హరీష్‌ అస్త్రం వాడుతున్నట్టు తెలుస్తోంది. జగ్గారెడ్డి కొంతకాలంగా గులాబీ గూటికి చేరడానికి తెగ ప్రయత్నిస్తున్నారు. కేసీఆర్‌ సంగారెడ్డి వస్తే దేశంలో ఎక్కడా లేనంతస్థాయిలో స్వాగతం పలుకుతానని.. హామీలు నెరవేరిస్తే గుడి కట్టిస్తానని.. వీధులకు ఆయన పేర్లు పెడతామని తెగ హడావిడి చేస్తున్నారు. అయినా స్పందన లేకపోవడంతో తాజాగా యాంటీ హరీష్‌ రావు స్వరం కూడా అందుకున్నారు. మరి ఎందుకో కానీ కేసీఆర్‌, కేటీఆర్‌ నుంచి ఆయనకు పిలుపు రావడం లేదు. తనతో పాటు పార్టీ వీడతారని ప్రచారం జరిగిన గండ్ర వెంకటరమణారెడ్డి ఇప్పటికే భార్యతో సహా కేటీఆర్‌ ను కలిసారు. కానీ జగ్గారెడ్డి వంతే ఇంకా రావడం లేదు. అయితే కేసీఆర్‌ జగ్గారెడ్డి పట్ల అంత సానుకూలంగా లేరని పార్టీ వర్గాలు చెబుతున్నారు. ఆయనపై కేసులు… గతంలో తనకు చేసిన ద్రోహం పట్ల ఆగ్రహంతో ఉన్నట్టు తెలుస్తోంది. వైఎస్‌ హయాంలో తనకు వెన్నుపోటు పొడిచి పార్టీని చీల్చిన విషయాన్ని కేసీఆర్‌ మరిచినట్టు లేదంటున్నారు. అయితే రాజకీయాల్లో శాశ్వత వైరాలు ఉండవని.. ఏదోఒకరోజు ప్రగతిభవన్‌ నుంచి కాల్‌ వస్తుందని జగ్గారెడ్డి ఆశాభావంతో ఉన్నారట. మరి ఆయనకు పిలుపు వస్తుందా? ఎప్పుడు చేరతారో చూడాలి.

Watch Video:

Recommended For You