స‌రైనోడు అలా బ్లాస్ట‌య్యాడేంటి?

బ్లాస్ట్ అయ్యాడా?

ల్లు అర్జున్ ఒక మ‌న‌సా ఆడియో ఫంక్ష‌న్‌లో బ్లాస్ట్ అయ్యాడు. అయితే ఇదంతా ఆయ‌న మ‌న‌సులో మాటలేనా? సరైనోడు చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు తెలుగు ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. చిరంజీవి స‌హా అంద‌రి త‌ర‌పునా వ‌కాల్తా పుచ్చుకుని అల్లు అర్జున్ మాట్లాడ‌డం పెనుదుమార‌మే రేపుతోంది. చిరంజీవి కూడా ప‌వ‌న్ క‌ళ్యాణ్ అభిమానుల వ‌ల్ల ఇబ్బంది ప‌డుతున్నారంటూ అల్లు అర్జున్ వ్యాఖ్యానించ‌డం గ‌మ‌నార్హం. గ‌తంలో నాగ‌బాబు చిరంజీవి పుట్టిన రోజు సంద‌ర్భంగా అభిమానుల‌పై ఇదే రీతిలో మండిప‌డ్డారు. కానీ ఆ త‌ర్వాత మీడియాలో వ‌చ్చిన వార్త‌లు చూసి ఎవ‌రూ ఆ ధైర్యం చేయ‌లేదు. మ‌ళ్లీ ఇంత‌కాలానికి స‌రైనోడు.. స‌రైన వేదిక చూసుకుని ప‌వ‌న్ అభిమానుల‌కు పంచ్ ఇచ్చాడు. వాస్త‌వానికి అల్లు అర్జున్ వ్య‌క్తం చేసిన అభిప్రాయం సినిమా ఇండ‌స్ట్రీలోని అంద‌రిలో ఉంది. అయిన దానికి.. కానిదానికి లేచి ప‌వ‌ర్ స్టార్ అని అర‌వ‌డం.. ద‌ర్శ‌కుల‌ను, నిర్మాత‌ల‌ను, చివ‌ర‌కు చిరంజీవి లాంటి వారిని కూడా మాట్లాడ‌కుండా అడ్డుకోవ‌డం వింత‌పోక‌డ‌గా మారుతోంది. దీని వ‌ల్ల మెగా ఫ్యామిలీ స‌భ్యులు ఫంక్ష‌న్‌కు రావాల‌న్నా.. ఏదైనా వేడుక జ‌ర‌పాల‌న్న భ‌య‌ప‌డే ప‌రిస్థితి వ‌స్తోంది. ఇంత‌కాలానికి అర్జున్ రూపంలో అంద‌రిలో అస‌హ‌నం బ‌య‌ట‌ప‌డింది. 
అయితే అల్లు అర్జున్ నాగబాబు కూతురు నిహారిక తొలి సినిమా ఆడియో వేడుకను వేదిక చేసుకోవ‌డానికి కార‌ణం ఉంది. ఇటీవ‌ల ప‌వ‌న్‌కు, అల్లు అర్జున్‌కు మ‌ధ్య వివాదాలు వ‌చ్చాయ‌ని సోషల్ మీడియాతో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. దీనికి చెక్ పెడుతూ… ప‌వ‌ర్ స్టార్ అంటే ఎంత ఇష్ట‌మో చెబుతూనే… ఆయన అభిమానుల వ‌ల్ల ఎంత న‌ష్ట‌పోతున్నామో అల్లు అర్జున్ విడమరిచి చెప్పారు. రెండోది స‌రైనోడు తన సినిమాకు సంబంధించిన ప‌లు స‌క్స‌స్ మీట్లు జ‌రిగినా.. అక్క‌డ ప్ర‌స్తావించ‌కుండా ఇక్క‌డే బ‌య‌ట‌పెట్ట‌డానికి కార‌ణం… ఇది కొణిదెల వారి ఫంక్ష‌న్‌. ఇక్క‌డైతే ఎవ‌రికి ఇబ్బంది ఉండ‌దు.. మ‌ళ్లీ కొణిదెల‌- అల్లు కుటుంబాల మ‌ధ్య గ్యాప్ ఉంద‌న్న అపోహ‌లు త‌లెత్త‌వు. అన్నింటికంటే ఇప్పుడు అర్జున్‌లో ఆత్మ‌స్తైర్యం పెరిగింది. ఇందుకు కార‌ణం… వ‌ర‌స‌గా మూడు సినిమాలు హిట్ అయ్యాయి. పైగా వంద కోట్ల మార్కును అందుకున్నాడు. త‌న కెరీర్ గాడిలో ప‌డింది.. ఏదైనా మాట్లాడే స్వేఛ్చ పెరిగింది. సొ… రిస్కు తీసుకుని మ‌న‌సులో బాధ వెళ్ల‌గక్కాడు. మొత్తానికి అన్ని కోణాల్లో ఆలోచించి. ప‌క్కా స్కెచ్ వేసి మ‌రీ స‌మ‌యం తీసుకుని త‌న మ‌న‌సులో మాట చెప్పాడు. ప‌వ‌న్ అభిమానుల‌తో ప‌డుతున్న వేద‌న బ‌య‌ట‌పెట్టాడు. మరి అర్జున్ వ్యాఖ్యలు పవన్ అభిమానుల్లో ఎలాంటి మార్పు తీసుకొస్తుందో చూడాలి. దూరం పెరుగుతుందా? తగ్గుతుందా? ఏమో? మరో ఆడియో ఫంక్షన్లో  సమాధానం తెలుస్తుంది.

Recommended For You

Comments are closed.