సొంతమనుకునేవాళ్లకు జగన్ ఝలక్

రాజకీయాల్లో జగన్ శైలి పూర్తి భిన్నంగా ఉంటుంది. గతంలో ఏ నాయకుడికి ఆయన్ను సరిపోల్చి చూసే
పరిస్థితి లేదు. తండ్రికి తగ్గ తనయుడే కానీ… రాజకీయ వ్యూహాల్లో తండ్రిని మించి పోయారు. YS
రాజశేఖరరెడ్డి ఒక్కసారి నమ్మితే చాలు… వారి కోసం ఎలాంటి పని అయినా చేసిపెడతారు. కోటరీలో పెద్దపీట
వేస్తారు. కానీ AP CM జగన్ ఇందుకు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తారు. ఎవర్నీ అంత త్వరగా
నమ్మరు.. నమ్మినా కొంతకాలమే. బంధువుల అయినా… స్నేహితులు అయినా.

వైవీసుబ్బారెడ్డి…

ఒకప్పుడు వైవీ సుబ్బారెడ్డి పార్టీని అంతా తానై నడిపించారు. జగన్ తర్వాత మొత్తం రాజకీయం
అంతాఆయన వద్దే తిరిగింది. పార్టీ రిజిస్ట్రేషన్ నుంచి మనీ మేటర్స్ వరకూ నెంబర్ 2 గా చక్రం తిప్పారు. కానీ
జగన్ ఆయనకు ఎన్నికల ముందు దాదాపు పక్కన పెట్టినంత పని అయింది. సిట్టింగ్ MP సీటు కూడా
ఇవ్వలేదు. దీంతో వైవీ సుబ్బారెడ్డి అలిగారు. అయినా జగన్ ఆయన్ను పెద్దగా ఓదార్చింది లేదు. గెలిచిన
తర్వాత చివరకు టీటీడీ బోర్డు ఛైర్మన్ పదవితో సరిపెట్టుకున్నారు. సొంత బాబాయి కాబట్టి ఆయన పార్టీలోనే
ఉండక తప్పలేదన్న చర్చ కూడా జరిగింది. ఒకప్పుడు పార్టీ మొత్తం నడిపించిన YV సుబ్బారెడ్డి
ఇప్పుడు ఉభయగోదావరి జిల్లాల ఇన్ఛార్జ్ గా పరిమితం అయ్యారు. అలా మొదటి నెంబర్ కథ టీటీడీకి
చేరింది.

విజయసాయిరెడ్డి..


వైవీ సుబ్బారెడ్డి హవా తగ్గుతుంటే.. క్రమంగా విజయసాయిరెడ్డి తన ప్రాబల్యం పెంచుకుంటూ వచ్చారు. పార్టీ
ప్రధాన కార్యదర్శిగా ఎన్నికల్లో మొత్తం చక్రం తిప్పారు. క్రమంగా నెంబర్ 2 స్థానం ఆక్రమించారు. మనీ
మేటర్స్… సోషల్ మీడియా, ఇతర పార్టీ అంశాలీన్న ఆయన కనుసన్నల్లో జరిగాయి. రాజ్యసభ సభ్యుడిగా
ఉన్న ఆయనకు ఎన్నికల్లో గెలిచిన తర్వాత పార్లమెంటరీ పార్టీ నేత హోదా ఇచ్చారు. కీలక స్టాండింగ్ కమిటీ
సభ్యుడిగా ఎన్నిక అయ్యారు. రాష్ట్రంలో వేసిన రాజధాని సహా అన్ని కమిటీల్లోనూ ఆయనకు చోటిచ్చారు
జగన్. మంత్రి పదవికి ఎంపిక చేసినవారికి కూడా విజయసాయిరెడ్డి ఫోన్ చేస్తారని జగన్ చెప్పడం కూడా
విజయసాయిరెడ్డి ప్రాధాన్యతను తెలియజేసింది. ఏడాది తిరిగే సరికి ఇప్పుడు విజయసాయిరెడ్డి కూడా
నెంబర్ 2 పోస్ట్ నుంచి అవుట్ అయినట్లే కనిపిస్తోంది. విశాఖపట్నం వెళుతూ జగన్ విజయసాయిరెడ్డిని
కారు దింపిన ఘటన రాజకీయంగా ఆయనకు తగ్గిన ప్రాధాన్యతకు అద్దం పడుతుంది. వాస్తవానికి జగన్
ఇంటి నుంచే ఈ వీడియో బయటకు వచ్చింది. అంటే అంత ధైర్యం చేసే వాళ్లున్నారా? లేక నిజంగానే
విజయసాయిరెడ్డికి అంతసీను లేదని చెప్పడానికి పార్టీ వ్యూహాత్మకంగా వీడియో రిలీజ్ చేసిందా అన్నది
ఆసక్తిగా మారింది. వీడియో వెనక కారణం ఏదైనా.. విజయసాయిరెడ్డి దూకుడు కనిపించడం లేదు. గతంలో
అంతా తానై అన్నట్టుగా వ్యవహరించారు. ఢిల్లీలో ఎంపీ అడుగు తీసి అడుగుపెట్టాలన్నా తన పర్మిషన్
కావాలని అడిగిన విజయసాయిరెడ్డి ఇప్పుడు కంట్రోలో చేసే పరిస్థితి లేదన్నది ఇన్ సైడ్ టాక్. అయితే వైవీ
సుబ్బారెడ్డి విషయంలో పార్టీలో కొంతసానుకూలత ఉంది. ఆయన పరిమితులకు లోబడి ఉంటారని… కానీ
విజయసాయిరెడ్డి స్థాయికి మించి ప్రవర్తించడం.. ఫిర్యాదులు వెళ్లడంతో జగన్ పక్కనపెట్టారన్న ప్రచారం
జరుగుతోంది. విశాఖ ఇన్ ఛార్జ్ గా ఆయన చేసిన ప్రకటనలు…నిర్ణయాలు కూడా వివాదాస్పదం అయ్యాయి.
విశాఖ రాజధానిగా ప్రకటించిన తర్వాత లక్షల మందితో మానవహారం చేస్తామని ప్రకటించారు కానీ
వేలమంది కూడా రాలేదు. ఇది పార్టీ ప్రతిష్టకు ఇబ్బందిగా మారింది. సోషల్ మీడియాలో ట్రోల్ అయింది.
దీనికి తోడు ఆయన సొంతంగా ట్రస్టు పెట్టి… చేసిన కార్యక్రమాలపై సొంత పార్టీ నేతలు కూడా ఫిర్యాదులు
చేసినట్టు తెలుస్తోంది. ఇక విశాఖలో స్థానిక ఎన్నికల అభ్యర్థుల ఎంపిక, పార్టీలో చేరికల విషయంలోనూ
జగన్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. సొంతంగా నిర్ణయాలు తీసుకోవడం… పసుపులేటి బాలరాజు
వంటివారిని చేర్చుకోవడం.. మొదటి నుంచి ఉన్నవారిని కాదని కొత్తవారిని అవకాశాలు ఇవ్వడంపై జగన్
మండిపడినట్టు జిల్లా పార్టీ వర్గాలు చెప్పాయి. ఆయన చేస్తున్న కొన్న ట్వీట్లు కూడా పార్టీని ఇరకాటంలో
పడేస్తున్నాయి. వైవీ సుబ్బారెడ్డి చాలాకాలం నెంబర్ 2గా ఉన్నారు. కానీ విజయసాయిరెడ్డి మాత్రం
సొంతంగా అవకాశాలను అందిపుచ్చుకోకుండా అత్యుత్సాహంతో జగన్ కు దూరమయ్యారన్న వార్త పార్టీలో
బలంగా వినిపిస్తోంది.

ఇప్పుడంతా సజ్జల…
జగన్ ఎక్కడుంటే అక్కడ కనిపించే విజయసాయిరెడ్డి ప్లేస్ ను ఇప్పుడు సజ్జల రామక్రుష్ణారెడ్డి ఆక్రమించారు.
గతంలో సాక్షి మీడియాలో కీలకంగా వ్యవహరించిన సజ్జల… సలహదారుడిగా మరి… ఇప్పుడు తాడేపల్లి
CM కార్యాలయంలో చక్రం తిప్పుతున్నారు. పార్టీ నిర్ణయాలన్నీ ఆయనే తీసుకుంటున్నారు. ఎన్నికల
ముందు వరకూ సజ్జల పెద్దగా ఎవరికీ తెలియదు. కానీ గత కొద్దిరోజులుగా ఆయన పేరు రాష్ట్ర వ్యాప్తంగా
మార్మోగిపోతుంది. జగన్ కు నమ్మినబంటుగా ఉంటూ… నిర్ణయాలు అమలు చేయడంలో ముందున్నారు.
నెంబర్ 2 స్థాయికి ఎదిగారు. అంటే వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి ఇప్పుడు సజ్జల వంతు వచ్చింది.
మరి ఆయన ఎంతకాలం ఉంటారన్నది చూడాలి….

స్నేహితుల విషయంలో….
అయితే జగన్ విషయంలో రాజకీయాలు ఎవరీకీ అంతుచిక్కని విధంగా ఉంటాయి. అధికారంలోకి వస్తే
ఖచ్చితంగా మంత్రి పదవులు వస్తాయని భావించిన పేర్లు.. శ్రీకాంత్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, రోజా,
అంబటి రాంబాబు. వీరంతా పార్టీ వాయిస్ బలంగా వినిపించారు. కానీ వీరిలో ఎవరినీ మంత్రి పదవి
వరించలేదు. జగన్ అందరి అంచనాలకు భిన్నంగా నిర్ణయాలు తీసుకున్నారు. దీనిని భట్టే జగన్ ఆలోచనలు
భిన్నంగా ఉంటాయని అర్ధమవుతుంది. అయితే కొంతమంది విషయంలో మాత్రం జగన్ పక్కాగా ఉంటారని
అంటున్నారు. ఎంపీ మిధున్ రెడ్డి, ఆయన తండ్రి రాంచంద్రారెడ్డి, మినిస్టర్ గౌతంరెడ్డి జగన్ కు అత్యంత
ఆప్తులు, స్నేహితులు. వారినే బలంగా విశ్వసిస్తారు జగన్. వారు కూడా జగన్ పట్ల విధేయత చూపిస్తారు
అత్యుత్సాహం ప్రదర్శించిన సందర్భాలు లేవు. కాబట్టే ఆ కుటుంబాలకు జగన్ పెద్ద పీట వేస్తారని
అంటున్నారు. గతంలో మరే నాయకుడితో పోలిక లేని జగన్ రాజకీయాలు ముందుముందు ఎలా
ఉంటాయో చూడాలి.

Recommended For You