రికార్డు సృష్టిస్తారా?

కల తీరుతుందా? 

5 రాష్ట్రాల‌కు ఎన్నిక‌లు ముగిశాయి. ఎగ్జిట్‌పోల్స్ ఫ‌లితాల‌ను దాదాపు ఖ‌రారు చేస్తున్నాయి. ద‌క్ష‌ణాదిలో కేర‌ళలో అన్ని ఎగ్జిట్‌పోల్స్ లెఫ్ట్ ఫ్రెంట్‌కు అనుకూలంగా ఉన్నా.. త‌మిళ‌నాడు విష‌యంలో కొంత గంద‌ర‌గోళం ఉంది. ఛాన‌ల్స్‌.. భిన్న‌మైన ఫలితాలు చూపిస్తున్నాయి. మొత్తానికి జ‌య‌ల‌లిత‌కు ఈసారి క‌ష్ట‌మే అంటున్నాయి. క‌రుణానిధికి ప్ర‌జ‌లు చివ‌రి అవ‌కాశం ఇచ్చిన‌ట్టే క‌నిపిస్తోంది. ద్ర‌విడ ఉద్య‌మాల్లో కీల‌క‌పాత్ర పోషించి.. రాజ‌కీయాల్లో అప‌ర బీష్ముడుగా పేరొందిన క‌రుణానిధి ఈసారి తానే సిఎం అభ్య‌ర్ధిగా ప్ర‌జ‌ల్లోకి వెళ్లారు. జ‌య‌ల‌లిత‌పై పై స‌ర్వ‌శ‌క్తులూ ఒడ్డారు. ఫ‌లితం కూడా కొన్ని స‌ర్వేల్లో అనుకూలంగా ఉంది. దీంతో డిఎంకేలో నూత‌నోత్సాహం వెల్లువిరుస్తోంది. సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఒక్క ఎంపీ కూడా గెల‌వ‌ని పార్టీ ఏకంగా రాష్ట్రంలో అధికారం దిశ‌గా అడుగులు వేస్తోంది. డిఎంకే గెలిస్తే రాష్ట్రానికి 92 ఏళ్ల కురువృద్దుడు క‌రుణానిధి సిఎం అవుతారు. ఈ వ‌య‌సులో సిఎం అయిన అతికొద్ది మందిలో ఒక‌డిగా రికార్డు సృష్టిస్తారు. ఆరోసారి ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు స్వీక‌రించ‌డానికి ఆయ‌న రెడీ అవుతున్నారు. ఫలితమే రావాల్సి ఉంది.
క‌రుణానిధే కాదు.. తమిళనాడు స‌రిహ‌ద్దు రాష్ట్రం కేర‌ళ‌కు కూడా సిఎం ఎవ‌రో దాదాపు తేలిపోయింది. ఆయ‌నే విఎస్ అచ్యుతానంద‌న్. సిపిఎం పార్టీ నాయ‌కుడు, ఉద్య‌మ‌కారుడు, క‌రువృద్దుడు అయిన అచ్యుతానంద‌న్ రెండోసారి ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు తీసుకొనున్నారు. ఆయ‌న వ‌య‌సు 92 ఏళ్లు. 2006-11 మధ్య ముఖ్య‌మంత్రిగా చేసిన ఆయ‌న… అప్ప‌టి నుంచి ప్ర‌తిప‌క్ష నేత‌గా అలుపెర‌గ‌ని పోరాటంచేశారు. ఈ వ‌య‌సులో కూడా ఎన్నిక‌ల ప్ర‌చారం ప‌రుగులు పెట్టించారు. ఎండ‌ల‌తో పోటీప‌డి.. 13 రోజుల్లో 13 జిల్లాల్లో 60 ర్యాలీల్లో పాల్గొన్నారు. 
రెండు రాష్ట్రాల‌ను ఇద్ద‌రు వృద్దులు న‌డిపించ‌నున్నారు. రాజ‌కీయాల్లో ఇద్ద‌రి అనుభ‌వం అసమాన్యం. వ‌య‌సు మీద‌ప‌డ్డా అచ్యుతానంద‌న్‌తో పోరాట స్ఫూర్తి త‌గ్గ‌లేదు. కుర్చీకే ప‌రిమితం అయినా.. మ‌రోసారి రాష్ట్రాన్ని పాలించాల‌న్న కోరిక క‌రుణానిధిని న‌డిపించింది. ఏక‌కాలంలో 90 ఏళ్లు దాటిన వృద్దులు సిఎంలుగా ఉండ‌డం అదీ పక్కపక్క రాష్ట్రాలకు నిజంగా రికార్డే అవుతుంది. మ‌రి అది సాద్య‌మ‌వుతుందా? కేరళ ఫలితం దాదాపు ఖాయం కాబట్టి.. తమిళనాడులో కరుణానిధి నేతృత్వంలోని డిఎంకే గెలిస్తేనే సాకారం అవుతుంది. 

Recommended For You

Comments are closed.