మింగలేక కక్కలేక ఆ కుటుంబాలు..!

ఆ మూడు కుటుంబాల్లో ఏడుగురు వైసీపీ ఎమ్మెల్యేలున్నారు. వారిలో ఒక్కరికీ మంత్రి పదవి దక్కక పోవడంతో మింగలేక కక్కలేక అన్నట్లుగా మెసులుకుంటున్నారు. ఒసీల్లో పుట్టాం..ఏ ఎస్సీలు గానో..ఎస్టీలుగానో పుట్టింటే మంత్రి పదవి వచ్చేదేమోనని వారిలో ఒకరు బాహాటంగానే చెప్పారు. కానీ తర్వాత తాను అన్న మాటలను టీవీల్లో ప్రసారం చేయవద్దని ఆయన కోరడం చర్చనీయాంశమైంది. ఆయనే కాదు..కర్నూలు జిల్లాలోనే మరికొందరిదీ ఇదే తీరు.

వైసీపీ ఏర్పడినప్పటి నుంచి పార్టీకి అండదండగా ఉన్నారు బాలనాగిరెడ్డి బ్రదర్స్. బాలనాగిరెడ్డి మంత్రాయలయంలో, సాయి ప్రసాద్ రెడ్డి ఆదోనిలో గెలవగా..వారి అన్న వెంకట్రామిరెడ్డిలు గుంతకల్ లో విజయం సాధించారు. వారి నాలుగో సోదరుడు, మాజీ ఎమ్మెల్సీ శివరామిరెడ్డి అదే పార్టీలో ఉన్నారు. కర్నూలు జిల్లాల్లో తమ కుటుంబానికి కచ్చితంగా మంత్రి పదవి వస్తుందని వాళ్లు భావించారు. కానీ అది అల్లంత దూరంలోనే ఆగింది. వారే కాదు..పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ఆరు సార్లు గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టారు. ఈ సారి తనకు మంత్రి పదవి దక్కుతుందని బలంగా భావించారు కాటసాని. కానీ దక్కలేదు. ఆయన సోదరుడు కాటసాని రామిరెడ్డి బనగానపల్లె నుంచి విజయభేరి మోగించినా ప్రయోజనం లేకపోయింది. ఇక నంద్యాలలో వైసీపీ పేరు చెబితే వినపడే పేరు శిల్పా బ్రదర్స్. మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి, ఆయన సోదరుడు చక్రపాణి రెడ్డిలు మంత్రి పదవి పై ఆశలు పెట్టుకున్నారు. శిల్పా మోహన్ రెడ్డి కుమారుడు రవి చంద్ర కిషోర్ రెడ్డి నంద్యాల ఎమ్మెల్యేగా, ఆయన బాబాయ్ చక్రపాణి రెడ్డి శ్రీశైలం ఎమ్మెల్యేగా గెలిచారు. నంద్యాల ఉప ఎన్నికల సమయంలో టీడీపీ నుంచి వచ్చిన ఒత్తిడులను గట్టిగానే తట్టుకున్నారు. ఇప్పుడు ఆ ఇంట్లో ఇద్దరు ఎమ్మెల్యేలుగా గెలిచినా ఒక్కరికీ మంత్రి పదవి దక్కలేదు. ఆ మూడు కుటుంబాలను కాదని..ఆలూరు ఎమ్మెల్యే జయరామ్ కు..డోన్ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డిలకు చోటు కల్పించారు సిఎం జగన్. అందుకే మింగలేక కక్కలేక అన్నట్లుగా ఉంది ఆ కుటుంబాల పరిస్థితి. ఇప్పుడు కాకపోయినా రెండున్నర ఏళ్ల తర్వాతనైనా మంత్రి పదవి దక్కుతుందని చెప్పుకుంటూ ముందుకెళుతున్నారు. అదండీ సంగతి.

 

Also Watch:

Recommended For You