మళ్లీ మ‌ళ్లీ అదే త‌ప్పు….!

త‌ప్పు చేస్తున్నారు.. మ‌ళ్లీ మ‌ళ్లీ అదే త‌ప్పు చేస్తున్నారు. విభ‌జ‌న స‌మ‌యంలో కూడా రాష్ట్ర విడిపోదంటూ ప్ర‌జ‌ల్ని మ‌భ్య‌పెట్టి మోసం చేసిన నాయ‌కులు ఇప్పుడు కూడా సాద్యం కాని  హోదాపై ప్ర‌జ‌ల్ని త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నారు. కేంద్రం ఇవ్వ‌న‌ని తెగేసి చెప్పినా సాధిస్తామ‌ని జ‌నాన్ని న‌మ్మించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. విభ‌జ‌న ఖాయ‌మ‌ని తెలిసినా.. చ‌ట్టంలో పెట్టాల్సిన అంశాల‌ను ప‌క్క‌న పెట్టి.. ఉమ్మ‌డి రాష్ట్ర‌మే సాధిస్తామంటూ ప్ర‌జ‌ల్ని న‌మ్మించి న‌ట్టేట ముంచారు. అప్ప‌డే బిల్లులో రాష్ట్రానికి న్యాయం చేసేలా అన్ని అంశాలు పెట్టి ఉంటే.. ఇప్పుడు ఈ క‌ష్టం వ‌చ్చేదా?  ఇదంతా ఎవ‌రు చేస్తున్న పాపం.. నాయ‌కుల‌ది కాదా? డ‌్రామాలు కాద‌ని చెప్ప‌గ‌ల‌రా?

ప్ర‌త్యేక‌ హోదా సాద్యం కాద‌ని అంద‌రికీ తెలిసిందే.. హోదా ఉన్న రాష్ట్రాల‌కే తీసేస్తుంది.. అయినా ఉద్య‌మాలు చేయ‌డం వ‌ల్ల ఏం ప్ర‌యోజ‌నం ఆశిస్తున్నారు. కేంద్ర విధానాలు తెలుసుకోకుండా ప్ర‌జ‌ల్లో సెంటిమెంట్ రెచ్చ‌గొడుతుంది నాయ‌కులే. అభివృద్దిని కోరుకోవాల్సిన వాళ్లు ఇప్పుడు కూడా రాజ‌కీయాలు చేస్తున్నారు. త‌మ స్వార్ధ ప్ర‌యోజ‌నాల కోసం హోదా మంట‌లు రాజేస్తున్నారు. కేంద్రం ముందు నుంచి క్లారిటీతోనే ఉంది. మ‌న నాయ‌కులే అసంబ‌ద్ద వాద‌న‌ల‌దో ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నారు. ప‌దిసార్లు ఎంపీలు పార్ల‌మెంట్‌లో ప్ర‌త్యేక హోదాపై ప్ర‌శ్నించారు. సాద్యం కాద‌ని.. అన్ని సార్లు కేంద్ర మంత్రులు స‌మాధానమిచ్చారు. రాత‌పూర్వ‌కంగా లేఖ‌లు రాశారు. అయినా మ‌ళ్లీ మ‌ళ్లీ ప‌ట్టుబ‌ట్ట‌డం వెన‌క రాజ‌కీయం లేదా?

వాస్త‌వానికి రాష్ట్రానికి అన్యాయం జ‌రిగింది. విభ‌జ‌న స‌మ‌యంలో హామీలు ఇచ్చారు. నెర‌వేర్చాల్సిరన‌ బాధ్య‌త కూడా ఉంది. కాద‌న‌డం లేదు. కానీ ఇవ్వ‌లేమ‌ని ప‌దేప‌దే చెప్పిన హోదా గురించి ఎందుకు రాద్దాంతం. స్ప‌ష్ట‌మైన ప్ర‌ణాళిక‌తో.. అంశాల వారీగా కేంద్రం నుంచి సాయం తీసుకోవాల్సిన అవ‌స‌రం ఎందుకు గుర్తించ‌డం లేదు. పోల‌వ‌రం ఇస్తామ‌న్నారు. లోటు బడ్జెట్ పూడ్చుతామ‌ని చెప్పారు. ఇంకా ఉత్త‌రాంధ్ర‌, సీమ‌, ద‌క్ష‌ణ కోస్తాకు ఏమిస్తారు.. ఆయా ప్రాంతాల్లో ఉన్న స‌మ‌స్య‌లేంటి? ఈ ప్రాంతాలు అభివృద్ది చెందాలంటే ఏం కావాలి. నివేదిక‌లు త‌యారుచేసి కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిన నాయ‌కులు ఆ దిశ‌గా ఎందుకు ఆలోచించ‌డం లేదు. పైగా ఉన్న రాష్ట్రాల‌కే హోదా తీసేయాల‌నుకున్న విధానంతో వెళ్లే మోడీని ఒప్పించ‌గ‌ల‌రా?
విభ‌జ‌న స‌మ‌యంలో పెద్ద‌లుగా వ్య‌వ‌హ‌రించి రాష్ట్రానికి చేసిన అన్యాయాన్ని మ‌ళ్లీ మ‌న నాయ‌కులు చేస్తున్నారు. గుర్తించాల్సిన అవ‌స‌రం ఉంది. చ‌ట్ట‌బ‌ద్దంగా రావాల్సిన వాటిపై పోరాటం చేస్తూనే.. ఇంకా కేంద్రం నుంచి ఏం తెచ్చుకోవాలో ఆలోచించాలి.

Recommended For You

Comments are closed.