ప‌త‌కాల ప‌థ‌కం.. వీళ్లు మార‌రు..!

ఆటల యుద్ధం…!

నిత్యం ప్ర‌తివ్యూహాలు… ప్ర‌తిక్ష‌ణం అంత‌ర్యుద్ధం.. ఆట‌ల‌పై మ‌మ‌కారం లేదు. ఆట‌గాళ్ల‌పై ప్రేమ‌లేదు. అంతా నాట‌కం.. ఆధిప‌త్య పోరాటం. ఎంత‌కాలం ఉన్నా వీరు మార‌రు. త‌మ విధానాలు మార్చుకోరు. రాజ‌కీయాల‌కు అంటించిన కుల‌, మ‌త‌, ప్రాంత మ‌కిలీ ఇక్క‌డా అంటిస్తున్నారు. అవును మాఊరు కాబ‌ట్టి మేమిస్తాం.. మా ద‌గ్గ‌ర పుట్టారు నేటివిటీ ఉంద‌ని మ‌రొక‌రు ఇస్తారు. ఇలా ప్ర‌జాధ‌నం రాల్చుతూనే ఉన్నారు. ఆట‌ల‌ను ప్రోత్స‌హించాలి. ఆట‌గాళ్ల‌ను ఉత్సాహ ప‌ర‌చాలి. కానీ అవి కాసుల‌తో, ఖాళీ జాగాల‌తో కాదు. ఫెల్ప్, బోల్ట్‌లాగా చెల‌రేగేలా విధానాలు ఉండాలి. మూడు ఒలంపిక్స్‌లో మూడేసి, ఐదేసి ప‌త‌కాలు సాధించినా ఇంకా ఆక‌లి తీర‌ని ఆట‌గాళ్ల‌ను మనమూ త‌యారుచేయాలి. కానీ కాసుల‌తో వారికి చ‌క్ర‌బంధంలో మ‌నం ఇరికిస్తున్నాం. ఆడింది చాల‌ని చెబుతున్నాం. అందుకే ఒక‌సారి ప‌త‌కం వ‌స్తే రెండోసారి సాధించిన‌వారి పేరు విని అర్ధ‌శ‌తాబ్ధం దాటింది. సాధించిన విజ‌యాలతో స‌రిపెడుతున్నారు. అదే మ‌న‌కు ద‌క్కిన ఘ‌న‌త‌గా భావిస్తున్నారు. అక్క‌డితోనే విజ‌యాలు ఆగిపోతున్నాయి. 

న‌జ‌రానాలు ఇవ్వండి న‌గ‌దుగా కాదు.. అంత‌ర్జాతీయ ఆట‌గాళ్ల‌తో పోటీప‌డ‌టానికి వారికి అవ‌స‌ర‌మైన స‌దుపాయాలు క‌ల్పించండి. విదేశాల్లో మ్యాచ్‌ల‌కు వెళితే విమానం టికెట్ ఫ్రీగా ఇస్తామ‌నండి. విదేశీ కోచ్‌ల‌ను తీసుకొస్తామంటే భారం మోయ‌డానికి సిద్ద‌మ‌ని చెప్పండి. సిల్వ‌ర్ ద‌గ్గ‌ర కాంస్యం ద‌గ్గ‌రో ఆగిన ఆటగాళ్లు ప‌సిడి సాధించ‌డానికి కావాల్సిన సదుపాయాలేంటో అడిగి తెలుసుకోండి. నాడు కాంస్యం కొట్టిన సైనా నెహ్వాల్ మ‌ళ్లీ గాయంతో వెనుదిర‌గ‌డానికి కార‌ణం ఎవ‌రు? దీపాకు నాలుగో స్థానం వ‌చ్చింది. ముందుగానే గుర్తించి ఉంటే ఖాయంగా ప‌త‌కం వ‌చ్చేది కాదా?
ఇవ‌న్నీ పాల‌కులకు ప‌ట్ట‌వు. పత‌కం వ‌స్తే పోటీలు ప‌డి న‌జరానాలు ప్ర‌క‌టించ‌డం కాదు.. మ‌రిన్ని ప‌త‌కాలు సాధించ‌డానికి ఏం చేయాలో ఆలోచించండి. కేంద్ర‌, రాష్ట్రాలు త‌మ ప‌ని కాద‌ని తిట్టుకోకుండా క్రీడ‌ను ఉమ్మడిగా ప్రోత్సహించండి. డ‌బ్బు మోజును ప‌రిచ‌యం చేయ‌కండి. సోష‌ల్ లైఫ్ ఉండాలి కానీ.. ఒలంపిక్స్‌కు నెల‌రోజుల ముందు మాత్ర‌మే శిక్ష‌ణ‌కు సిద్ద‌మ‌య్యేంత‌గా వారిని ఫ్యాష‌న్‌, పేజ్‌3 లైఫ్‌కు అల‌వాటు చేయ‌కండి. బ్రాండ్ అంబాసిడార్లు అంటూ దృష్టి మ‌ళ్ల‌కుండా చేయండి. వారి ఆట‌ను ఆడ‌నివ్వండి.. రిటైర్ అయ్యాక వారి సేవ‌ల‌ను… దేశానికి వినియోగించుకోండి. విధానాలు మార‌నంత వ‌ర‌కు పోటీప‌డి న‌జ‌రానాలు ఇచ్చేవ‌ర‌కు ఆట‌లో అర‌కొర ప‌త‌కాలు మాత్ర‌మే వ‌స్తాయి. 

Recommended For You

Comments are closed.