పిట్ట‌ల పోరేనా?

తెలంగాణ కాంగ్రెస్ నేతలు

పిట్ట‌ పోరు పిట్ట పోరు పిల్లి తీర్చింది అని.. ఇప్పుడు కాంగ్రెస్ ప‌రిస్థితి రాష్ట్రంలో ఇలాగే ఉంది. హ‌స్తం నేత‌ల మ‌ధ్య అంత‌ర్గ‌త పోరును అధికార గులాబీద‌ళం అనుకూలంగా మ‌లుచుకుంటోంది. అంత‌ర్గ‌త ప్ర‌జాస్వామ్యం పార్టీలో ఎక్కువే. కానీ కీల‌క‌మైన ఈ స‌మ‌యంలో కూడా కుమ్ములాట‌లు రాష్ట్రంలో పార్టీ మ‌నుగడ‌ను ప్రశ్నార్ధ‌కం చేస్తున్నాయి. తెలంగాణ ఇచ్చింది మేమే, తెచ్చింది మేమే అని హ‌స్తం నేత‌లు మొత్తుకున్నా తెలంగాణ‌లో జ‌నం ప‌ట్టం కట్ట‌లేదు. అధికారం అందుతుంద‌ని ఆశించినా ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షానికి ప‌రిమితం కావాల్సి వ‌చ్చింది. భ‌విష్య‌త్తులో ప్ర‌త్యామ్నాయం మేమే అని జ‌నానికి చూపించే ప్ర‌య‌త్నం కూడా  ఇప్పుడు నాయ‌కులు చేయ‌డం లేదు. తెలంగాణ‌లో తెలుగుదేశం దాదాపు ఖాళీ అయింది. క‌మ‌ల‌నాధులు ఉన్నా.. న‌గ‌రానికి పరిమితం. దీంతో ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త అంటూ వ‌స్తే అది త‌మ‌కే లాభించేలా కాంగ్రెస్ ఇప్ప‌టి నుంచే క‌ష్ట‌ప‌డాలి. కానీ ఈ విషయంలో పార్టీ ఘోరంగా విఫ‌ల‌మ‌వుతోంది. ఇందుకు కార‌ణం గ్రూపు రాజ‌కీయాలు. ఇప్ప‌టికే టిఆర్ఎస్ ఆప‌రేష‌న్ ఆక‌ర్శ్ అంటూ వ‌ల‌స‌ల‌తో కాంగ్రెస్‌ను అత‌లాకుతులం చేస్తోంది. అంత‌ర్గ‌త పోరుతో భ‌విష్య‌త్తు వెతుక్కుంటూ చిట్టెం రామ్మోహ‌న్ రెడ్డి, పువ్వాడ అజ‌య్ వంటి వాళ్లు కారెక్కారు. ఉన్న‌వారిని కాపాడుకోవ‌డం చేత‌కానీ కాంగ్రెస్‌ వారిలో వారు గొడ‌వ‌లు ప‌డుతున్నారు. పార్టీలో కొంద‌రు త‌న‌పై త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్నారంటూ సీనియర్ నాయకుడు జానారెడ్డి ఏకంగా సిఎల్పీ ప‌ద‌వికి రాజీనామా చేస్తాన‌న‌డం పెను దుమార‌మే రేపింది. ఇది ఇలా ఉంటే అటు పాలేరు గెలిపించుకుంటే ప‌రువైనా ద‌క్కుతుందని భావిస్తున్న స‌మ‌యంలో ఖ‌మ్మం జిల్లా పార్టీ రెండు వ‌ర్గాలుగా విడిపోయింది. ఎవ‌రికి వారు విమ‌ర్శ‌ల‌తో వీధికెక్కుతున్నారు. రేణుకాచౌద‌రి, భ‌ట్టి వ‌ర్గాల మ‌ధ్య ఆధిప‌త్య పోరాటం పాలేరుకు శాపంగా మారింది. పొంగులేటి సుధాక‌ర్ రెడ్డి సైతం వివాదాలకు ఆజ్యం పోశారు. ఇక‌ పార్టీలో విహెచ్‌, పాల్వాయి వంటి వృద్ధ‌నేత‌లు ఎలాగూ త‌ర‌చుగా వివాదాల‌తో తెర‌ముందుకు వ‌స్తారు. ఇలా అయితే పార్టీ నిల‌బ‌డేది ఎలా? భ‌విష్య‌త్తులో అధికారం ద‌క్కించుకునేదెలా అని ఆందోళన వ్య‌క్తం చేస్తున్నారు కార్య‌క‌ర్త‌లు.

Recommended For You

Comments are closed.