న‌యీం ఎన్‌కౌంట‌ర్ వెన‌క‌ కార‌ణ‌మిదేనా?

అలా బుక్కయ్యాడు..!

న‌యీం వ్య‌వ‌హారంలో రోజుకో కొత్త వ్య‌వ‌హారం వెలుగుచూస్తోంది. గ్యాంగ్‌స్ట‌ర్‌తో సంబంధాలు ఉన్నాయంటూ నాయ‌కులు ప‌ర‌స్పర ఆరోప‌ణ‌ల‌కు దిగుతున్నారు. సంచ‌ల‌నాలు కారణమవుతున్నారు. దీంతో ఈ కేసులు ఎక్క‌డ ఎవరికీ అర్ధం కావ‌డం లేదు. అయితే పోలీసులు మాత్రం జాగ్ర‌త్త‌గా లీకులు ఇస్తూ ఒక్క‌క్క‌టిగా గుట్టు విప్పుతున్నారు. ఇందులో ఎవ‌రి పేరు అయినా వినిపించవచ్చు. పాల‌కులు గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తే చాలు న‌యీంతో అంట‌కాగిన వారి ప్రముఖుల జాత‌కాలు తెల్లారే స‌రికి ప‌త్రిక‌ల్లో, మీడియాలో సాక్షాత్క‌రిస్తాయి. మ‌రి ప్ర‌భుత్వం ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటుందో అర్ధం కావ‌డం లేదు. వాస్త‌వానికి ఈ పాటికే స‌హ‌క‌రించిన అధికారులు, నాయ‌కుల అరెస్టులు జ‌రుగుతాయ‌ని అంతా భావించారు. కానీ ఒక్క ప్ర‌ముఖుడి అరెస్టు జ‌ర‌గ‌లేదు. అంటే ఎవ‌రి ప్ర‌మేయం లేకుండానే న‌యీం న‌ర‌హంత‌కుడు, వేల కోట్ల మాఫియా సామ్రాజ్యానికి అధిప‌తి అయ్యాడా? ఇదంతా ప‌క్క‌న పెడితే.. అస‌లు ఇంత‌కాలం హైద‌రాబాద్ చుట్టుప‌క్క‌ల ద‌ర్జాగా చ‌క్క‌ర్లు కొడుతూ సెటిల్‌మెంట్లు చేసిన న‌యీం ఇప్ప‌డే ఎందుకు చిక్కాడు.. దీని వెన‌క ఎవ‌రున్నారు.. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.. దీని వెన‌క ర‌స‌వ‌త్త‌ర చ‌ర్చ జ‌రుగుతోంది.

వాస్త‌వానికి న‌యీం కొంత‌కాలంగా రాజ‌కీయాల్లోకి రావాల‌ని ఆశ‌ప‌డుతున్నాడు. అందుక‌నుగుణంగానే వ్యూహాలు ర‌చించ‌డం మొద‌లుపెట్టాడు. ఇప్ప‌టికే త‌న‌కు స‌హ‌కారం అందించిన నేత‌ల‌పై త‌న‌ను రాజ‌కీయాల్లోకి తీసుక‌రావాల‌ని.. అధిష్టానం వ‌ద్ద త‌న‌కు లైన్ క్లియ‌ర్ చేయాల‌ని ఒత్తిడి తేసాగాడ‌ట‌. అంతే కాదు.. ఇందుకోసం భారీగానే ఖ‌ర్చు చేయడానికి సిద్ధమయ్యాడు. వినాయ‌క ఉత్స‌వాలు, ఇత‌ర పండ‌గ‌ల పేరుతో సామాజిక బాధ్య‌త క‌ల‌రింగ్ ఇవ్వ‌డం కూడా మొద‌లుపెట్టాడు. అయితే న‌యీంకు ఎంత స‌హ‌క‌రించినా అత‌న్ని రాజ‌కీయాల్లో తీసుక‌రావ‌డం అంత‌సుల‌భం కాదు. పైగా అదిష్టానం వ‌ద్ద ఆ మాట చెబితే త‌మ ప‌ద‌వులే ఊడే ప‌రిస్థితి ఉంది. అటు క‌క్క‌లేక మింగ‌లేక పోయారు కొందరు నాయ‌కులు. పని కాకపోవడంతో నయీం బెదిరింపుల దాకా వెళ్లాడు. దీంతో నేత‌లు కొంద‌రు పెద్ద‌ల ద‌గ్గ‌రకు వెళ్లారు. అంతే కాదు ప్రాణ‌భ‌యం కూడా ఉంద‌ని కాపాడాలని మొర‌పెట్టుకున్నారు. బెదిరింపుల‌కు సంబంధించిన ఫోన్ సంభాష‌ణ‌లు కూడా వినిపించిన‌ట్టు తెలుస్తోంది. దీంతో న‌యీం ఆగ‌డాలు పెరిగిపోయాయ‌ని భావించిన ప్ర‌భుత్వం ఎంత‌మాత్రం స‌హించ‌రాద‌ని నిర్ణ‌యించింది. దీనికి తోడు ప్రభుత్వానికి అత్యంత సన్నిహితంగా ఉండే ఓ పారిశ్రామికవేత్తను కూడా కోట్ల రూపాయాలు ఇవ్వాలంటూ నయీం బెదిరించసాగాడు. కిడ్పాప్ చేయడానికి స్కెచ్ కూడా వేశాడు. ఇవన్నీ గమనించిన ప్రభుత్వం పాత పాల‌కులు చేసిన త‌ప్పిదాలు చేయ‌రాద‌ని కఠినంగా వ్యవహరించాలని నిర్ణ‌యించింది. 

స‌రిగ్గా ఇదే స‌మ‌యంలో న‌యీం కూడా రాజ‌కీయాల్లో వ‌స్తానని భావించి.. త‌న అనుచ‌రులు పేరుతో కొనుగోలు చేసిన వందల కోట్ల ఆస్తుల‌ను తిరిగి ఇచ్చేయాల‌ని ఆదేశించాడు. అయితే వారు ఇందుకు నిరాక‌రించారు. అత్యంత స‌న్నిహితులే త‌న‌ను మోసం చేస్తున్నార‌ని గ్ర‌హించిన న‌యీం వారి అంతు చూడ‌టానికి సిద్ద‌మ‌య్యాడు. దీంతో వారంతా అండ‌ర్‌గ్రౌండ్‌లోకి వెళ్లారు. తెర‌వెన‌కుండి న‌యీంకు వ్య‌తిరేకంగా పావులు క‌దిపారు. ఒక‌రిద్ద‌రు అనుచరులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. న‌యీంకు సంబంధించిన సీక్రెట్స్ విప్పారు. అప్ప‌టికే పోలీసుల‌కు న‌యీం ఆప‌రేష‌న్‌లో ఉన్నారు. అటు బెదరింపులు, ఇటు అనుచ‌రులు ఇచ్చిన స‌మాచారంతో పోలీసులు ప‌క్క‌గా ప్లాన్ చేశారు. కొద్దికాలం రెక్కీ నిర్వహించిన మరీ షాద్ న‌గ‌ర్ వ‌ద్ద ఎన్ కౌంట‌ర్ చేశారు. న‌యీం ఎన్ కౌంట‌ర్‌కు కొద్దిరోజుల ముందే గ్యాంగ్‌స్ట‌ర్ అనుచులు లొంగిపోయారు. వారిచ్చిన స‌మాచార‌మే న‌యీం ఎన్ కౌంట‌ర్‌లో కీల‌క పాత్ర పోషించింది.  

మొత్తానికి బినామీ ఆస్తులు వ‌దుల‌కోవ‌డం ఇష్టం లేని అనుచ‌రుల స‌మాచారం.. రాజ‌కీయాల్లోకి రావాల‌న్న అత్యాశ న‌యీం ప‌త‌నానికి దారి తీసింది. లేదంటే రాజ‌కీయాల్లోకి వ‌చ్చి ఉంటే మ‌రెన్ని దారుణాలు చూడాల్సి వ‌చ్చేదో… మ‌రి ఇంత‌కీ నయీం  ఆగడాలకు ఇంత‌కాలం స‌హ‌క‌రించిన వారి పేర్లు బ‌య‌ట‌కు వ‌స్తాయా? అదే చూడాలి.

Recommended For You

Comments are closed.