న్యూస్ ఈజ్ మార్కెట్.. జర్నలిస్టు అనుభవం

న్యూస్ ఈజ్ మార్కెట్.. బాగా చెప్పారు సార్. పాలగుమ్మి సాయినాధ్ లాంటి వాళ్ల ఎక్కడో నూటికి కోటికి ఒకరు ఇంకా అభాగ్యుల కోసం కలం పడుతున్నారు. ఆలోచన కూడా నవతరం చేయడం లేదు. మీ వ్యాసం చదివాక 10 ఏళ్లు కాలం గిర్రన వెనక్కు తిరిగింది. కళ్లముందు నా మిత్రుడికి ఎదురైన ఒకటి రెండు సందర్భాలు కళ్లముందు కదలాడాయి.
ఎప్పుడూ దాహం తీర్చే చెరువు కదా అని గొంతు తడుపుకున్నకాడెద్దులు కాలం చేస్తున్నాయి. పాలిచ్చే బర్రెలు పాపం చెరువులోనే ప్రాణాలు వదులుతున్నాయి. మనుషులు రోగాల పాలవుతున్నారు. సంపాయించిన పైసలు డాక్టరుకు తగలేస్తున్నారు. జనాలు అలవాటు పడ్డారు. బతుకులింతే అని ఫిక్సయ్యారు. పాపాలు చేస్తున్నపెద్దలు ఏసీ గదుల్లో మినరల్ వాటర్ తాగుతూ టీవీలు చూస్తున్నారు. దళారీలుగా మారిన నేతలు జేబులు నింపుకుంటున్నారు. గుక్కెడు నీళ్లు దొరక్కుండా చేసినా.. పాతాళంలో దాగున్న జలాలను సైతం కాలకూటవిషంగా మార్చినా.. నోరు తెరిసి అడగలేని అసమర్ధులుగా జనాన్నిమార్చారు. కాలరు ఎగరేసే చిల్లర నాయకుల చేతిలో మనుషులుగా మారారు. అంతగా గొడవ చేస్తే విభిజించు, పాలించు అంటూ కులాల కుంపటి ఉండనే ఉంది.
ఉడుకు రక్తంతో ఫీల్డులో అడుగుపెట్టిన ఓ యువజర్నలిస్టుకు ఇది చూసి కడుపు మండింది. కలంతో పేదల పక్షం గళం విప్పాలనుకున్నాడు. పరిశ్రమ విషం చిమ్ముతున్న తీరును తెలుసుకున్నాడు. ఆధారాలు సేకరించాడు. పాపం పేదల భయపడుతూనే ముందు గొంతు విప్పారు. ఇన్ఫార్మర్ల ద్వారా విషయం వారి చెవిన పడింది. యువ జర్నలిస్టు వార్త ఇవ్వడానికి ముందే వివరణ చేరాల్సిన చోటుకు చేరింది. రెండు మూడు గ్రామాల ప్రజలు రోగాలు వస్తున్నాయని వందల కోట్ల పరిశ్రమను మూసేయాలా? వారంతే గొడవ చేస్తారు పనికి మాలిన వాళ్లు అంటూ పెద్దాయన ఒకరు వదిలేసి రమ్మన్నారు. జిల్లా కేంద్రంలో కడుపు నిండిన వాళ్లు తిన్నది అరక్క చేసే ధర్నాలను కవర్ చేయమని ఆదేశించారు.
సరేలా పెద్దలతో ఎందుకులే.. ఉద్యోగంతో చెలగాటం అని యువ జర్నలిస్టు మనసు మార్చుకున్నాడు. కొద్ది రోజులకే ధర్నాల కవరేజీలో మజా దొరకలేదు. మనసులో వెలితి. తనలో జర్నలిస్టు ఎక్కడ చస్తాడో అని ఈ సారి రూటు మార్చాడు. డబ్బున్న పెద్దలతో వద్దని గిరిజన బాట పట్టాడు. అడవి బిడ్డల కష్టాలపై కలం పెట్టాలనుకున్నాడు. ఆలోగా మరోసారి పెద్దలు లైన్ లోకి వచ్చారు. నీ సామాజిక సేవ ఆపి కాస్త వ్యాపారం చూడు అన్నారు. అర్ధం కానట్టు ఉన్న విలేకరికి జ్హానబోధ చేశారు. గిరిజనులు పత్రికలు చదువుతారా? అక్కడ సేల్స్ ఎంత? పేపరు చదవని వారి వార్తలు రాస్తే వచ్చే లాభమేంటి? యాడ్స్ ఇస్తారా? స్పేస్ వేస్టు కాదా అంటూ విడమరిచి చెప్పారు. ఆదాయం వచ్చే వార్తలు చూడన్నారు. ఉద్యోగం చేయాలంటే ఉడుకు రక్తం, పెద్దల పట్ల జాలీ, సమాజం పట్ల బాధ్యత అవసరం లేదు. చెప్పింది చేస్తే చాలని మనవాడికి అర్ధం అయింది. మళ్లీ పెద్దల జోలికి పోలేదు. ఆదివాసీల దగ్గరకు వెళ్లే ధైర్యం చేయలేదు. మీడియా సంస్థలు మారినా కోరిక తీరలేదు. చివరకు అలవాటు పడి నలుగురిలో ఒకరిగా మారాడు.

Recommended For You