తండ్రి పాలన ముగిసిన కాడే కొడుకు శ్రీకారం చుడతారా?

ఏపీలో పోటీ టగ్‌ ఆప్‌ వార్‌ లాగా ఉంది. టీడీపీ- వైసీపీ లు ఎవరికి వారు విజయంపై ధీమాగా ఉన్నారు. ఎవరు గెలిచినా 120 -130 సీట్లు అంటున్నారు. ఏపీలో గెలిచేది వైసీపీనే.. సీఎం అయ్యేది జగన్మోహన్‌ రెడ్డి అంటూ పార్టీ వర్గాలు హడావిడిచేస్తున్నాయి. శ్రేణులు సైతం సంబరాలకు సిద్దమవుతున్నాయి. సోషల్‌ మీడియాలోనూ కేబినెట్‌ పై ప్రచారం ఊపందుకుంది.

ఇదిలా ఉంటే.. వైసీపీ అధికారంలోకి వస్తే జగన్మోహన్‌ రెడ్డి ప్రమాణస్వీకారం ఎక్కడ చేస్తారన్న చర్చ ఆసక్తిగా మారింది. జగన్‌ ఆలోచనలు అర్ధం చేసుకోవడం అంత సులభం కాదు.. ఆయన ప్రమాణస్వీకారం విషయంలోనూ కొత్తగా ఆలోచించే అవకాశం ఉందంటున్నాయి శ్రేణులు. రాజధాని అమరావతి అంటే జగన్‌ మొదటి నుంచి కొంత విముఖంగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో సెంటిమెంట్‌ కోసం ఆయన రెండు ప్రాంతాల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అధికారంలోకి వచ్చి సీఎంగా ప్రమాణస్వీకారం చేయాల్సిన పరిస్థితి వస్తే.. పావురాల గుట్ట నుంచి ఆయన పదవి చేపట్టే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది. ముఖ్యమంత్రిగానే ఉండి తండ్రి వైఎఎస్‌ రాజశేఖరరెడ్డి చనిపోయాడు. తన తండ్రి పాలన ఎక్కడ ముగిసిందో… అక్కడే రాజన్న పాలన మళ్లీ మొదలుపెడతారంటూ చర్చ జరుగుతోంది. ఇందులో భాగంగానే పావురాల గుట్ట సమీపంలో ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అక్కడ ఏర్పాట్లు చేయడం లేదా.. రవాణా ఇబ్బంది అవుతుందని భావిస్తే.. తండ్రి సమాధి ఉన్న ఇడుపులపాయకు మారే అవకాశం ఉందట. అక్కడి నుంచి పావురాల గుట్టకు వెళ్లి కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్‌ ఉందని చెబుతున్నారు. పావురాల గుట్ట లేదా.. ఇడుపుల పాయ పేర్లు జగన్‌ ఛాయిస్‌ కావొచ్చని పార్టీ వర్గాలంటున్నాయి. అయితే ఇందుకు భిన్నంగా అమరావతిలో ప్రమాణం చేసే అవకాశాలూ కూడా లేకపోలేదంటున్నారు. రాజధాని తరలించబోమని సంకేతాలు ఇవ్వడానికి అమరావతి ప్రాంత ప్రజలకు భరోసా కల్పించడానికి ఇక్కడే ప్రమాణస్వీకారం చేస్తారని కూడా చెబుతున్నారు. మొత్తానికి జగన్‌ అధికారంలోకి వస్తే మాత్రం ఆయన ప్రమాణస్వీకారం ఎక్కడన్నది ఆసక్తిగా మారింది.

Recommended For You