జగన్ నీతి పాఠాలు పట్టించుకోని సొంత పార్టీ ప్రజాప్రతినిధులు

పార్టీలో ఎవరిని లెక్కచేయని మనస్తత్వం.. తాను అనుకున్నదే చేసే మొండితనం. టికెట్ల విషయంలో తనదే తుది నిర్ణయం. ఇవన్నీ జగన్‌ లో బలాలు. పొత్తులు లేకుండా… ఒంటరిపోరాటం చేసి పార్టీని గెలిపించారు. జనాలు అఖండ విజయం కట్టబెట్టారు. ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు ఏకపక్షంగా వచ్చాయి. దీంతో ఆయన మాటకు ఎదురులేదు… పార్టీలో క్రమశిక్షణకు తిరుగుండదు అనుకున్నారు. పైగా నిత్యం నీతికథలుచెబుతున్నారు. ఎవరూ హద్దులు మీరొద్దని… నిజాయితీ ఉండాలని క్లాసులు తీసుకుంటున్నారు. కానీ ముచ్చటగా మూడు నెలలు అయినా తిరక్క ముందే పార్టీలో అంతర్గత విబేధాలు భగ్గుమన్నాయి. అదీ రాజధాని పరిధిలో ఇద్దరు ప్రజాప్రతినిధుల మధ్య జరుగుతున్న ఆధిపత్యపోరు అధినేతకు చిరాకు తెప్పిస్తోంది. గుంటూరు జిల్లా తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి, బాపట్ల ఎంపీ నందిగం సురేష్‌ మధ్య అగ్గి రాజుకుంది. ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ప్రొటోకాల్ వివాదంతో మొదలై… అక్రమ ఇసుక తవ్వకాలను ప్రోత్సహిస్తున్నారంటూ ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకునేస్తితికి వచ్చింది. ఇటీవల ప్లెక్సీ గొడవలో ఇరు వర్గాలు రోడ్డు మీదనే తన్నుకున్నాయి. అయితే ఇద్దరి మధ్య అసలు గొడవకు కారణం ఇసుక తవ్వకాలే అంటున్నారు స్థానికులు. ఎవరికి వారు మైనింగ్‌ పై కన్నేసినట్టు ఆరోపణలున్నాయి. ఈ విషయంలోనే ఇద్దరి మధ్య వివాదం రాజుకుందట. తన నియోజవకర్గంలో ఎంపీ పెత్తనం ఏంటని ఎమ్మెల్యే శ్రీదేవి ప్రశ్నిస్తున్నారు. నియోజకవర్గంలో వేలు పెట్టడానికి వీల్లేదని… సందేశం పంపారట.. ఎంపీ అయితే నాకేంటి అన్నట్టు తెలుస్తోంది. దీంతో ఎంపీ కూడా ఇది తన నియోజకవర్గం పరిధిలోకి వస్తుందని… నేనూ ప్రజాప్రతినిధినే అంటూ నందిగం సురేష్‌ కయ్యానికి కాలు దువ్వారట. రాజధాని పరిధిలో ఉన్న ప్రజాప్రతినిధులు ఇలా వీధికెక్కడంతో సీఎం జగన్‌ ఇబ్బంది పడుతున్నట్టు తెలుస్తోంది. అంతా క్రమశిక్షణలో ఉండాలని… జవాబుదారీగా ఉండాలని పదేపదే ఎల్పీ సమావేశంలో క్లాసులు పీకుతున్న జగన్‌ కు తొలి షాక్‌ రాజధానిలోనే తగలడం గమనార్హం. అధికారంలో లేకపోతే ఎవరిపని వారు చేసుకుంటున్నారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రొటోకాల్‌, మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య వివాదాలు… ఎంపీలకు, ఎమ్మెల్యేలకు మధ్య ఆధిపత్యం.. మంత్రులకు, ఎంపీలకు మధ్య గ్యాప్‌ ఎన్నో ఉంటాయన్నది జగన్‌ కు ఇప్పుడు బోధపడుతుంది. తాడికొండలో మొదలైన అంతర్గతపోరు.. ఎక్కడకు విస్తరిస్తుందో చూడాలి…. ఎన్నికల్లో భారీగా ఖర్చు పెట్టిన నాయకులు… మళ్లీ సంపాదించుకోవడానికి చేసే ప్రయత్నాల్లో ఇలాంటి ఇంకెన్నో చూడాల్సి వస్తుందని… అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మరి జగన్‌ క్రమశిక్షణ ప్రతిపక్షంలో ఉన్నంతవరకేనా? అధికారంలోకి వస్తే ఆయన చేతుల్లో కూడా ఉండాదా? చూడాలి. గత ప్రభుత్వంలో ఇసుక అక్రమ తవ్వకాలు ఆరోపణలు చేసి.. కొత్త పాలసీ తీసుకొచ్చిన జగన్‌ కు… తమ నేతలు కూడా ఆదాయం కోసం ఇసుక మైనింగ్‌పై పడ్డారన్న వాస్తవం ఈ గొడవతో తేలడం మరింత కలవరపెడుతోంది.

Recommended For You