జగన్మోహన విన్యాసమా?

పార్టీ మీటింగ్ లో జగన్

ప‌డిపోతున్న ప్ర‌తిష్ట‌.. కాపేతెర వ‌ర్గాల్లో వ్య‌తిరేక‌త న‌డుమ జ‌గ‌న్ పార్టీ క్యాడ‌ర్‌కు దిశానిర్దేశం చేసే ప్ర‌య‌త్నం చేశారు. యువ‌జ‌న శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ విజ‌య‌వాడ‌లో నిర్వ‌హించిన విసృత‌స్థాయి స‌మావేశం ప‌ర‌నింద ప‌రాయ‌ణం.. స్వీయ స‌న్మానం అన్న‌ట్టుగా సాగింది. అయితే కొంత‌లో అయినా జ‌గ‌న్‌లో మార్పు వ‌చ్చిన‌ట్టు క‌నిపిస్తోంది. ఎంత‌సేపూ విమ‌ర్శ‌లు.. అధికార పార్టీపై నిప్పులు చెర‌గ‌డం కాదు.. కార్య‌క‌ర్త‌ల‌కు దిశానిర్దేశం చేసి వారిని జ‌నాల్లోకి తీసుకెళ్లాల‌న్న ఆలోచ‌న చేయ‌గ‌లిగారు. వాస్త‌వానికి ఇది ఎప్పుడో చేయాల్సి ఉన్నా.. ఇంత‌కాలానికి అధినేత క‌ళ్లు తెరిచారు. సంస్థాగ‌తంగా బ‌లమైన పునాదులు లేకుండా నేత‌లే ఎంత‌కాలం చేతులతో  ఫ్యాన్ తిప్పినా గాలి వారికే చాల‌డం లేదు. ఇంకా జ‌నానికి భ‌రోసా ఎలా ఇస్తారు. అందుకే చేతుల‌తో కాకుండా ఇక నుంచి చేత‌ల‌తో ప‌నిచేయాల‌ని ఎట్టికేల‌కు జ‌గ‌న్ గుర్తించారు. త‌న ప్ర‌సంగంలో ఆమాత్రం జాగ్ర‌త్త‌లు తీసుకున్నారు. భ‌విష్య‌త్తు ఎన్నిక‌ల్లో సీట్లు, ప‌ద‌వులు డ‌బ్బులుంటేనో… తాత‌లు, తండ్రులు మాజీలు అయితేనో రావంటూ ప‌దేప‌దే చెప్పారు. పార్టీని జ‌నాల్లోకి తీసుకెళ్లేవారికి అవ‌కాశం ఇస్తాన‌ని ప్ర‌క‌టించారు. అదే కాదు. జ‌నాల్లోకి ఎలా వెళ్లాలో కూడా ఉప‌దేశించారు. పార్ట్‌టైమ్ జాబ్‌లో క‌ష్ట‌ప‌డి ఫ‌లితాలు సాధిస్తే చాలు ఫుల్‌టైమ్ పోలిటిషీయ‌న్‌ను చేస్తామ‌ని హామీ ఇచ్చారు. తానొక్క‌డే జ‌నాల్లోకి వెళితే స‌రిపోద‌ని.. మీరంతా కూడా వెళ్లి ప్ర‌చారం చేయాల‌న్నారు. అవును మ‌రీ సాక్షి ఛాన‌ల్ రావ‌డం లేదు కాదా.. ఇక కార్య‌క‌ర్త‌లే మైకులు ప‌ట్టుకుని చంద్ర‌బాబును తిట్టిపోయాలా అని ప‌రోక్షంగా అక్క‌డ కొంద‌రు గుస‌గుస‌లాడ‌టం క‌నిపించింది. అయినా అవేమీ జ‌గ‌న్ దాకా పోవు క‌దా? ఆయ‌న స్టైల్‌లో ప్ర‌సంగం కానిచ్చారు. 

కార్య‌క‌ర్త‌లుకు దిశానిర్దేశం చేయాల్సిన స‌మావేశంలో జ‌గ‌న్ త‌న మార్కు విమ‌ర్శ‌లు వ‌ద‌ల్లేదు. చంద్ర‌బాబుపై మ‌రోసారి అరిగిపోయిన క్యాసెట్ వేసి మ‌రీ పార్టీ నాయ‌కుల‌కు వినిపించారు. మ‌న‌కు పాఠాలు చెబితే చాలు క‌దా.. మ‌ళ్లీ విమ‌ర్శ‌లు క్యాసెట్‌ ఎందుక‌ని కొంద‌రు నేత‌లు లోలోన అనుకున్నారు. అధినేత‌ను ప్ర‌శ్నించ‌లేరు క‌దా?  మౌనంగా భ‌రించారు. ప‌నిలో ప‌నిగా చంద్ర‌బాబుపై విమ‌ర్శ‌లు చేయ‌డానికి అధినేత ముందు పోటీ ప‌డి మ‌రీ మార్కులు తెచ్చుకున్నారు కొంద‌రు యువ‌నాయకులు. మొత్తానికి స‌భ మాత్రం బాగానే సాగింది. కానీ ఇంకాస్త క్యాడ‌ర్‌కు స‌మ‌యం ఇస్తే బాగుండేదంటున్నారు. అంతే కాదు కాపు ఉద్యమంపైనా.. తాజా రాజకీయ పరిస్థితులపైనా క్లారిటీ కూడా ఇవ్వలేదంటున్నారు.

Recommended For You

Comments are closed.