‘చంద్ర‘ వ్యూహాలు ఫ‌లించాయా?

చాణక్యం ప్రదర్శించారా?

AP ప్ర‌త్యేక హోదా విష‌యంలో ప్ర‌జ‌ల నుంచే కాదు.. మిత్ర‌పక్షం టీడీపీ నుంచి కూడా తీవ్ర విమ‌ర్శ‌లు.. విప‌క్షాల నుంచి శాపనార్దాలు ఎదుర్కొన్న కేంద్రం న‌ష్ట నివార‌ణ చ‌ర్య‌ల్లో ప‌డిన‌ట్టే క‌నిపిస్తోంది. హోదా సాద్యం కాద‌ని దాదాపు నిర్ణ‌యానికి వ‌చ్చినా.. అంత‌కుమించి సాయం చేసిన‌ట్టు ఏపీ జ‌నం ముందు క‌నిపించ‌క‌పోతే సానుభూతి అంతా టీడీపీకి.. కాంగ్రెస్ త‌ర‌హా ఫ‌లితం త‌మ‌కు తప్పదని క‌మ‌ల‌నాధులు గ్ర‌హించిన‌ట్టున్నారు. ఇక లాభం లేద‌నుకుని విభ‌జ‌న హామీల‌పై దృష్టి సారించారు. ఒక్క‌క్క‌టిగా అమ‌లు చేసే ప‌నిలో ప‌డ్డారు. వాస్త‌వానికి మిగ‌తా రాష్ట్రాల‌తో పోల్చితే ఏపీకి విద్యాసంస్థ‌లు, ప‌రిశోధ‌నా కేంద్రాలు ఇచ్చినా.. అవేమీ జ‌నం పెట్టుకున్న ఆకాంక్ష‌ల ముందు ఆవ‌గింజంతైనా క‌నిపించ‌డం లేదు.

పార్ల‌మెంట్ స‌మావేశాలు ముగుస్తూనే ఏపీలో జ‌రిగిన న‌ష్టం పూడ్చుకునే ప‌నిలో బీజేపీనాయ‌కులు ప‌డ్డారు. హోంమంత్రితో వెంక‌య్య‌నాయుడు స‌మావేశం అయ్యారు. అరుణ్‌జైట్లీకి ప్ర‌ధాని సంకేతాలు పంపారు. అంతే వేగంగా ఫైల్స్ క‌దిలాయి. పది రోజుల్లోనే సుమారు 2వేల కోట్ల రూపాయలు సాయం ప్రకటించారు. త్వ‌ర‌లో మ‌రిన్ని ప‌థ‌కాల‌కు అవసరమైన ఆర్ధిక చేయూతనివ్వ‌డానికి రంగం సిద్ద‌మ‌వుతోంది. ఇటు సురేష్ ప్ర‌భు కూడా రంగంలో దిగారు. రైల్వే ప‌రంగా రాష్ట్రానికి ఏం చేయ‌వ‌చ్చో చంద్ర‌బాబుతో ట‌చ్‌లో ఉండి తెలుసుకుంటున్నారు. పెండింగ్ ప్రాజెక్టుల‌కు ప‌చ్చ‌జెండా ఊపుతున్నారు. నిధుల రాక న‌త్త న‌డ‌క‌న సాగిన‌  నంధ్యాల అమరావతిని పూర్తి చేశారు. బుధ‌వారం  కేంద్ర కేబినెట్ స‌మావేశంలో సుమారు 3వేల 8వంద‌ల కోట్ల ఖ‌ర్చు అయ్యే గూడూరు –  విజ‌య‌వాడ మూడోలైన్‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. జాయింట్ వెంచ‌ర్‌గా మ‌రో భారీ ప్రాజెక్టుకు డీపీఆర్ సిద్దం చేస్తున్నారు. ఇక ప‌ట్ట‌ణాభివృద్ది ప‌థ‌కంలో భాగంగా ఇటీవ‌ల విజ‌య‌వాడ మెట్రో ప్రాజెక్టుకు 3వంద‌ల కోట్లు ఇచ్చారు. అమృత్‌, ఉద‌య్, స్మార్ట్ సిటీల ఎంపిక‌లో త‌గు స్థానం క‌ల్పించారు. ఇలా ఏపీకి మేమున్నామ‌ని భ‌రోసా ఇచ్చే ప్ర‌య‌త్నం బీజేపీ ఇప్ప‌డే మొద‌లుపెట్టింది. ఎప్పుడో చేయాల్సింది కానీ ఆలస్యంగా అయినా పార్టీ భ‌విష్య‌త్తుకు అవ‌స‌రాన్ని గుర్తించారు. 

ఇదంతా ఓర‌కంగా చంద్ర‌బాబునాయుడి వ్యూహ ఫ‌లితంగానే వ‌చ్చాయంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు. పార్ల‌మెంట్‌లో కేవీపీ రూపంలో వ‌చ్చిన ప్ర‌త్యేక హోదా బిల్లును త‌న‌కు అనుకూలంగా మ‌లుచుకున్నారు చంద్రబాబు. అటు ప్ర‌జ‌ల్లో వ‌చ్చిన వ్య‌తిరేక‌త‌ను అడ్డుకుని య‌థాత‌ధంగా క‌మ‌ల‌నాధుల వైపున‌కు మ‌ళ్లించారు. చంద్ర‌బాబు వ్యూహం ఫ‌లించి బీజేపీపై ఒత్తిడి పెరిగింది. ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. కమలనాధులను దోషిగా నిల‌బెట్టేలా చేసింది. ప్ర‌త్యేక హోదా సాద్యం కాద‌ని చంద్ర‌బాబుకు తెలుసు. గ‌తంలో ఆయ‌నే దీని వ‌ల్ల పెద్ద‌గా ప్ర‌యోజ‌నం లేద‌న్నారు. కానీ ఇప్పుడు అదే మాట చెబితే తాను కూడా ప్ర‌జ‌ల ముందు ఇబ్బంది ప‌డాల్సి వ‌స్తుంది. సరిగ్గా ఇదే సమయంలో తనదైన చాణక్యం ప్రదర్శించారు. బిల్లును త‌న‌కు అనుకూలంగా మ‌లుచుకుని డిమాండ్లు నెర‌వేర్చుకోడానికి ప్రణాళిక రచించారు. విపక్షాల భుజంపై తుపాకీ పెట్టి.. బీజేపీని టార్గెట్ చేశారు. అక్క‌డే చంద్ర‌బాబు విజ‌య‌వంతమ‌య్యారు. హస్తిన నుంచి నిధులు జాడ మొదలైంది.

Recommended For You

Comments are closed.