గోరంత విజ‌యం.. కొండంత ల‌క్ష్యం!

పట్టుదలగా వెళతారా?

విభ‌జ‌న అనంత‌రం అన్యాయం జ‌రిగింద‌ని.. రాజ‌ధాని కూడా లేని రాష్ట్రంగా మార్చి క్రాస్‌రోడ్డులో నిల‌బెట్టారంటూ ప్ర‌జాగ్ర‌హం వెల్లువెత్తిన స‌మ‌యం అది. స‌రిగ్గా ప్ర‌జా ఆందోళ‌న‌ల‌ను… చంద్ర‌బాబునాయుడు త‌న‌కు అనుకూలంగా మార్చుకున్నారు.  హైటెక్ న‌గ‌రాన్ని నిర్మించిన అనుభ‌వాన్ని చూపించి.. న‌వ్యాంధ్ర క‌ల‌ల రాజ‌ధానితో పాటు రాష్ట్రాన్ని దేశంలో అగ్ర‌రాష్ట్రం నిలుపుతానని ఎన్నిక‌ల‌కు వెళ్లారు. అప్ప‌టికే ప్ర‌ధాని అభ్య‌ర్ధిగా ఫుల్ స్వింగ్‌లో ఉన్న న‌రేంద్ర‌మోడీ ఇమేజ్‌ను  క్యాష్ చేసుకున్నారు. ఇక మ‌రో వ‌ర్గానికి ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ద్వారా కాపుకాసి ఓట్లు చీల‌కుండా జాగ్ర‌త్త ప‌డ్డారు. ప్ర‌జా మ‌ద్ద‌తుతో అధికార ప‌గ్గాలు చేప‌ట్టారు. చూస్తుండ‌గానే రెండేళ్లు గ‌డిచాయి. మ‌రి ఈ రెండేళ్ల‌లో స‌రైన దిశ‌లో రాష్ట్రం ప‌య‌నిస్తుందా? ప‌్ర‌జ‌లు ఆకాంక్ష‌ల‌కు అనుగుణంగా ఏపీలో టీడీపీ పాల‌న సాగుతుందా? ఇవే ఇప్పుడు చ‌ర్చించుకోవాల్సిన అవ‌స‌ర‌ముంది…

సంక్షేమం
సంక్షేమ రంగంలో ఆయ‌న అడుగులు స‌రైన దిశ‌లో ప‌డుతున్నాయి. ప్ర‌జ‌ల‌కు స‌దుపాయాలు క‌ల్పించ‌డంలో ముందున్నారు. ఫించ‌న్లు, రేష‌న్‌దుకాణాల ద్వారా నిత్యావ‌స‌రాలు, పండ‌గ‌ల‌కు ఆయా వ‌ర్గాల‌కు చంద్ర‌న్న కానుక‌లు, మిన‌ర‌ల్ వాట‌ర్ ప‌థ‌కాలు, అన్నా క్యాంటిన్లు, విద్యార్ధినీల‌కు సైకిళ్లు, పేద‌ల ఆరోగ్యానికి అన్న భ‌రోసా ఇలా ప్ర‌జ‌ల్లో మంచి మార్కులే కొట్టేశారు. న‌దుల అనుసంధానం ద్వారా ప‌ట్టిసీమ పూర్తి చేసి కృష్ణా డెల్టాకు నీరిందించ‌డం ద్వారా సాగు రంగంలో ముంద‌డుగు వేశారు. పోల‌వ‌రం పూర్తి అయితే సాగునీటి స‌మ‌స్య‌కు శాశ్వ‌త ప‌రిష్కారంతో పాటు..ప‌రిశ్ర‌మ‌ల‌కు అవ‌స‌ర‌మైన నీటివ‌న‌రులు కూడా అందుబాటులో వ‌స్తాయి. కేంద్ర సాయం త‌గ్గినా చంద్ర‌బాబు నిధులు ఇవ్వ‌డం ద్వారా చిత్త‌శుద్దిని చాటుకుంటున్నారు. ఆర్ధిక వ‌న‌రుల స‌మ‌స్య ఉన్నా రైతుల రుణ‌మాఫీని చేసి చూపించారు. ఉద్యాన పంట‌ల‌కు వర్తింపచేశారు. అయితే ఇంకా ఇంటికో ఉద్యోగం, ప‌క్కా గృహాలు వంటి ప‌థ‌కాలు పూర్తి చేయాల్సి ఉంది. మ్యానిఫెస్టోలో ఇంకా చాలా హామీలు పెండింగ్‌లో ఉన్నా రాష్ట్ర ఆర్ధిక స్థితిగ‌తుల‌ను అర్ధం చేసుకుని పెద్ద‌గా నిల‌దీయ‌డం లేదు జనాలు. ఇది చంద్రబాబుకు అనుకూలంగా మారింది.

అభివృద్ధి – స‌వాళ్లు 
వాస్త‌వానికి ఏపీలో ప్రభుత్వం సాధించింది గోరంత‌… ఇంకా సాధించాల్సిన‌ ల‌క్ష్యం కొండంత ఉంది. చంద్ర‌బాబునాయుడు ముందు పెనుస‌వాళ్లే ఉన్నాయి. రాజ‌ధానికి 33వేల ఎక‌రాల‌ను పైసా ఖ‌ర్చు లేకుండా స‌మీక‌రించి త‌న శ‌క్తియుక్తుల‌ను చాటుకున్నారు. కానీ అక్క‌డ జ‌ర‌గాల్సిన అభివృద్ధే అస‌లు ప‌రీక్ష‌గా మారింది. విలువైన భూముల చుట్టూ జ‌రిగే రాజ‌కీయాల‌ను త‌ట్టుకుని అక్క‌డ న‌గ‌రాన్ని సాకారం చేయాల్సిన బాధ్య‌త చంద్ర‌బాబుపై ఉంది. అది అంత‌సుల‌భం కాదు. 25వేల మంది రైతుల జీవ‌నోపాధికి సంబంధించిన అంశం. ఏమాత్రం ఎమ‌ర‌పాటుగా ఉన్నా మొత్తం క‌థ అడ్డం తిరిగే ప్ర‌మాదం ఉంది. అందుకే రాజ‌ధాని కేంద్రంగా జ‌రిగే ప్ర‌తిఘ‌ట్టం కూడా అత్యంత కీల‌కం. చంద్ర‌బాబునాయుడు 2019 నాటికి అక్క‌డ జ‌రుగుతున్న అభివృద్ధిని చూపించాలి. లేదంటే ఎన్నిక‌ల‌ ప్రజాతీర్పు మారే ప్రమాదం ఉంది. దేశ విదేశాల్లో ప‌ర్య‌టించిన చంద్ర‌బాబునాయుడు పెట్టుబ‌డులు వ‌స్తాయ‌ని చెబుతున్నారు. మాట‌ల్లో ఉన్నంత వేగం ఆచ‌ర‌ణ‌లో కనిపించ‌డం లేదు. విదేశాల నుంచి ప్ర‌తినిధులు వ‌స్తున్నా వ‌చ్చిన పెట్టుబ‌డులు అంతంత మాత్రమే. పైగా తెలంగాణ‌లో యాపిల్, గూగుల్, అమోజాన్‌, ఐకియా వంటి సంస్థ‌లు వ‌స్తున్నా.. ఏపీలో వాటి ఊసు లేక‌పోవ‌డంతో నిరుత్సాహానికి గురిచేస్తోంది. పెట్టుబడులపై చంద్ర‌బాబు త‌న స‌మ‌ర్ధ‌త‌ను నిరూపించుకోవాల్సిన అవ‌స‌రం ఉంది. ఇసుజు వంటి కంపెనీలు వ‌చ్చినా.. పాక్స్‌కాన్ వంటి సెల్ యూనిట్లు నెల‌కొల్పినా ఆశించిన స్థాయిలోఉపాధి అవకాశాలు మెరుగుపడలేదు. హీరో, ఏషియ‌న్ వంటి కంపెనీలు ఒప్పందాల వ‌ర‌కూ వ‌చ్చి చేజారిన‌ట్టే క‌నిపిస్తోంది. జ‌పాన్‌, సింగ‌పూర్ ల‌పై చంద్ర‌బాబు ఆశ‌లు పెట్టుకున్నారు. అవి నెర‌వేరితే మాత్రం ఇంటికో ఉద్యోగం వ‌చ్చిన‌ట్టే.. కానీ తమిళనాడు, కర్నాటక, తెలంగాణ వంటి  రాష్ట్రాల నుంచి పోటీ త‌ట్టుకుని తీససుక‌రావ‌డం చంద్ర‌బాబు స‌మ‌ర్ధ‌త‌కు అగ్నిప‌రీక్షే. ఇక ఇండ‌స్ట్రీయ‌ల్ కారిడార్లు, గ్రోత్ సెంట‌ర్లకు కూడా పునాదులు ప‌డ‌లేదు. స్మార్ట్ సిటీల్లో ప‌నులు పెండింగ్‌లోనే ఉన్నాయి.

రాజకీయంగా స‌వాళ్లు 
చంద్ర‌బాబునాయుడు ముందు రెండు రాజ‌కీయ స‌వాళ్లున్నాయి. బీజేపీతో మిత్ర‌ప‌క్షంగా ఉన్నా రాష్ట్రానికి సాయం చేయ‌డం లేద‌న్న భావ‌న ఉంది. దీనిపై చంద్ర‌బాబునాయుడు స్ప‌ష్ట‌త ఇవ్వాల్సిన అవ‌స‌రం ఉంది. రాజ‌కీయంగా ప్ర‌స్తుతానికి బీజేపీతో చెలిమి అవ‌స‌రం అయినా.. ఇంకా ఎంత‌కాలం అన్న సందేహాలున్నాయి. సొంతంగా ఎద‌గాల‌నుకుంటున్న బీజేపీకి స‌హ‌జంగానే టీడీపీ శ‌త్రువు అవుతుంది. ప‌ర‌స్స‌ర అప‌న‌మ్మ‌కంతో ఎంత‌కాలం స్నేహం సాగిస్తారు? రాష్ట్ర ప్ర‌యోజ‌నాలు నెర‌వేర‌డం లేదు.. రాజ‌కీయంగా ప‌క్క‌లో బ‌ల్ల‌మే. మ‌రి దీనిని ఎలా అధిగ‌మిస్తార‌న్న‌ది ఆస‌క్తిగా మారింది. ఇక వైసీపీ నుంచి వ‌ల‌స వ‌స్తున్న ఎమ్మెల్యేలు ప్ర‌స్తుతం రాజ‌కీయంగా పార్టీకి బ‌లం అయినా.. నియోజ‌క‌వవ‌ర్గాలు పెర‌గ‌క‌పోతే బ‌ల‌హీన‌త‌గా మారి.. పార్టీనే ద‌హించివేస్తుంది. కేంద్ర తీరు చూస్తుంటే ఇప్ప‌ట్లో నియోజ‌క‌వ‌ర్గాల పునఃర్విభ‌జ‌న సాద్య‌మ‌య్యేలా లేదు. మ‌రి చంద్ర‌బాబు ఈ గండం ఎలా దాటతార‌న్న‌ది చూడాలి. ఇక ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా పార్టీకి ఎప్ప‌టికీ ప్ర‌మాద‌మే అన్న ఆందోళ‌న అంతర్గతంగా ఉంది. అధికారం చేప‌ట్టేంత బ‌లం లేక‌పోయినా…. టీడీపీ ఓట‌మికి కార‌ణం కాగ‌ల శ‌క్తి ఆయ‌న‌లో ఉంది. గ‌తంలో అన్న చిరంజీవి చేసిన ప‌నే.. ఇప్పుడు త‌మ్ముడు చేస్తే టీడీపీకి క‌ష్టాలే. అలా జ‌ర‌గ‌కుండా ప‌వ‌ర్‌స్టార్‌ను ఎంత‌కాలం టీడీపీ మేనేజ్ చేస్తుంద‌న్న‌ది చూడాలి.

మూడేళ్లు.. ముందున్నీ ముళ్లే..

చంద్ర‌బాబు ముందు ఉంది మూడేళ్లు.. ప‌రిష్క‌రించాల్సి.. సాధించాల్సిన ల‌క్ష్యాలు ఎన్నో ఉన్నాయి. ఇప్ప‌టికీ 50శాతానికి పైగా జ‌నాలు చంద్ర‌బాబుకే మ‌ద్దతుగా ఉన్న‌ట్టు స‌ర్వేలు చెబుతున్నాయి.  మాట‌లతో కాకుండా చేత‌ల‌తో జ‌నాల‌కు త‌న స‌మ‌ర్ధ‌త‌ను చాటుకోవాలి. ఇంకా పేద అరుపులు అరిస్తే జ‌నాలు పెద‌వివిరుస్తారు. కొంత‌కాలానికి వ్య‌తిరేక‌త వ్య‌క్తం చేస్తారు. అదే జ‌రిగితే పాల‌కుల‌ను కూడా జ‌నం మారుస్తారు.

Recommended For You

Comments are closed.