రెవెన్యూ శాఖకు.. కేటీఆర్ సిఎం పదవికీ లంకె పడిందా..?

తెలంగాణ కేబినెట్ లో ఉండాల్సిన ఇద్దరు కీలక వ్యక్తులు ఈ సారి ప్రమాణస్వీకారం చేయలేదు. హరీష్ రావు సంగతి వేరే.. దీనిపై జరుగుతున్న చర్చలు.. రాజకీయంగా ఉండే అనివార్య పరిస్థితులు విభిన్నం. కానీ అత్యంత సమర్దుడు, పార్టీకి కీలక నేత అయిన కేటీఆర్ లేకపోవడం కార్యకర్తలను నిరాశకు గురిచేసింది. అయితే ఆయన నేరుగా పార్లమెంట్ ఎన్నికల తర్వాత సీఎం అవుతారని  దాదాపు ఫిక్స్ అయ్యారు. సంకేతాలు కూడా వచ్చాయి. వాస్తవానికి జూన్ మాసంలో కేటీఆర్ కీలక పదవి తీసుకుంటారని చర్చ జరిగినా.. ఇప్పుడాపరిస్థితి లేదు. పార్లమెంట్ ఎన్నికలు, జిల్లా, మండల పరిషత్ ఎన్నికల తర్వాత పార్టీపై కేటీఆర్ కు పూర్తిగా పట్టు చిక్కుతుంది. కేంద్రంలో కూడా ప్రభుత్వంలో చేరాలా వద్దా అనే స్పష్టత వస్తుంది. అప్పుడే కేటీఆర్ కు కూడా పగ్గాలు అప్పగిస్తారని అంతటా చర్చ జరిగింది. కార్యకర్తలు కూడా కేటీఆర్ సీఎం అని ఫిక్స్ అయ్యారు. కానీ ఇప్పుడు కేసీఆర్ తీసుకుంటున్న నిర్ణయాలు, అమలు చేస్తున్న విధానాలు చూస్తుంటే కేటీఆర్ కు సీఎం పదవి అనుమానమే అంటున్నారు. మంత్రిగా లేదంటే పార్టీకే పరిమితం అవుతారని చెబుతున్నారు. రెవిన్యూ శాఖ ప్రక్షాళనకు కేసీఆర్ నడుం బిగించారు. రిజిస్ట్రేషన్లు, వ్యవసాయ శాఖల విలీనం పనులు పెట్టుకున్నారు. ఇది అంత సులభం కాదు.. రాజకీయంగా ఏమాత్రం పట్టుసడలినా .. ఉద్యోగులు బుసకొడతారు. ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే అవకాశం ఉంది. శాఖ ఎత్తేస్తారన్న కోపంలో వారు ప్రభుత్వంపై దండెత్తే ప్రమాదం ఉంది. కఠినంగా వ్యవహరిస్తూ వ్యూహాత్మకంగా అడుగులు వేయాల్సి ఉంటుంది. అందుకే ఈశాఖ ప్రక్షాళన పూర్తి అయ్యే వరకు కేసీఆర్ సీఎంగా ఉంటారని తెలుస్తోంది. అంతే కాదు.. త్వరలో మరిన్ని శాఖలు కూడా ప్రక్షాళన చేయడంతో పాటు.. ప్రాజెక్టులు గాడిలో పెట్టిన తర్వాతే కేటీఆర్ విషయంలో ఆలోచించే అవకాశం ఉందంటున్నారు. కేటీఆర్ కూడా పదవి విషయంలో తొందరపడకపోవడం.. ముందుగా పార్టీ మొత్తం తన గ్రిప్ లోకి తీసుకోవడంలో తలమునకలయ్యారు. ఒక  ఏడాది తర్వాతే కేటీఆర్ కు సీఎం యోగం ఉంటుందని తెలుస్తోంది. కేటీఆర్ ఎలాంటి ిఇబ్బందులు లేకుండా పాలనాపరంగా సవాళ్లు తలెత్తకుండా.. రాజకీయంగా  ఎదురులేని విధంగా పరిస్థితులు కల్పించి ఇస్తారని అంటున్నారు. మొత్తానికి రెవిన్యూ శాఖ ప్రక్షాళన అనుకున్న తర్వాతే కేటీఆర్ కు పదవి విషయంలో నిర్ణయం మార్చుకున్నారని పార్టీ వర్గాలంటున్నాయి.

Recommended For You