కుటుంబ రాజకీయాల కోసమే పార్టీ మారుతున్నారా?

కాంగ్రెస్ నాయకులు తమ స్వార్ధ ప్రయోజనాల కోసం పార్టీ మారుతున్నారా? వాస్తవానికి మొదట్లో కేసీఆర్‌ కొందరిని మాత్రమే పార్టీలో చేరాలని ఆహ్వానించారు. విజయవంతం అయ్యారు. కానీ ఇప్పుడు చేరేవారంతా తమకు తాముగా కేసీఆర్‌ వద్దకు రాయభారం పంపినట్టు తెలుస్తోంది. గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తే పార్టీలోకి వచ్చేందుకు సిద్దంగా ఉన్నామని సందేశం పంపారట. అయితే కేసీఆర్‌ కూడా ఆచితూచి అడుగులు వేస్తున్నారు. పార్టీకి అవసరమనుకున్న నేతలను కారులోకి ఎక్కించుకుంటున్నారు. ఇటీవల పార్టీలో చేరేందుకు మగ్గురు ఎమ్మెల్యేలు సిద్దమయ్యారు. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి. కాంగ్రెస్‌ పార్టీలో సీనియర్‌ నాయకుడు. గతంలో కాంగ్రెస్‌ అధికారంలో ఉండగా విప్‌గా పనిచేశారు. ఇటీవల ఎన్నికల్లో త్రిముఖ పోటీలో కూడా భూపాలపల్లి నుంచి కాంగ్రెస్‌ కేడర్‌ గెలిపించుకుంది. కానీ కేడర్‌ నమ్మకాన్ని వమ్ము చేస్తూ ఆయన పార్టీ వీడుతున్నారు. ఆయన సతీమణి రాజకీయ భవిష్యత్తు కోసం ఆయన కాంగ్రెస్‌ వీడి కారెక్కుతున్నట్టు తెలుస్తోంది. గత దశాబ్ధకాలంగా భార్య జ్యోతి రాజకీయ భవిష్యత్తు కోసం ఆయన చేయని ప్రయత్నం లేదు. కాంగ్రెస్‌ అధికారంలో ఉండగా మేయర్‌ పదవి కోసం ప్రయత్నించారు. కానీ సమీకరణాలు కలిసిరాక ఆశ నెరవేరలేదు. ఇప్పుడు జిల్లాలు పెరిగాయి. భూపాలపల్లి జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ పదవిపై కన్నేసినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్‌ లో ఉంటే గెలవలేమని తెలిసి కేసీఆర్‌ వద్దకు రాయభారం పంపారట. తన భార్యకు జిల్లా పరిషత్‌ ఒక్క పదవి ఇస్తే చాలని.. ఎలాంటి కండీషన్స్‌  లేకుండా పార్టీలోకి వస్తానని చెప్పారట. దీనికి కేసీఆర్‌ కూడా హామీ ఇవ్వడంతో పార్టీలో చేరేందుకు సిద్దమైనట్టు తెలుస్తోంది.
Watch video:

అటు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా తన కూతురు రాజకీయ భవిష్యత్తు కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. వచ్చే ఎన్నికలు నాటికి తన కూతురుకు అసెంబ్లీ టికెట్‌ లక్ష్యంగా కారెక్కుతున్నట్టు తెలుస్తోంది. ఈలోగా తన భార్య నిర్మలకు జెడ్పీ ఛైర్మన్‌ పదవి కూడా ఆశిస్తున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే సబితా ఇంద్రారెడ్డి తన వారసుడు కార్తీక్‌ విషయంలో భరోసా తీసుకున్నాకే పార్టీలో చేరినట్టు చెబుతున్నారు. కార్తీక్‌ కు రాజ్యసభ లేదంటే జెడ్పీ ఛైర్మన్‌ పదవి ఇస్తారని తెలుస్తోంది. మొత్తానికి వారసులకు అవకాశాల కోసం కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు పార్టీలు మారుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. మరి ఇందులో ఎంతమందికి పదవులు వస్తాయో చూడాలి.

Recommended For You