కవిత ఎఫెక్ట్‌.. నిజామబాద్ కాంగ్రెస్‌ నేతలు పరార్

Regional Telangana

కాంగ్రెస్  పార్టీలో సీట్ల యుద్ధం మొదలైంది. ఇప్పటికే లోక్‌ సభ టికెట్ల కోసం నేత‌ల క్యూ క‌డుతున్నారు. ఢిల్లీలో లాబీయింగ్ ముమ్మరం చేశారు. తెలంగాణలోని 17 పార్లమెంట్ స్థానాల‌కు మొత్తం 380 మంది ఆశావాహులు ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. అయితే .. అందులో నిజ‌మాబాద్ పార్లమెంట్ సీటుకు మాత్రం ఒక్కటంటే ఒక్కటి కూడా ధరఖాస్తు రాలేదు. మిగతా చోట్ల ఒక్కో నియోజకవర్గం నుంచి డజన్ల కొద్దీ నేతలు పోటీపడుతుంటే… నిజామాబాద్‌ నుంచి ఒక్కరు కూడా ఆసక్తిచూపలేదు. ధరఖాస్తులు కూడా రాలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్‌ రాని జిల్లా నేతలు పార్లమెంట్‌ సీటు కోసం పట్టుబట్టారు. అధిష్టానం నుంచి హామీ కూడా పొందారు. తీరా ఇప్పుడు ముఖం చాటేస్తున్నారు.మాకొద్దంటే మాకొద్దంటున్నారు.

Watch Video:

ఎంపీ మధుయాష్కీ, మాజీ మంత్రి సుదర్శన్‌ రెడ్డి, షబ్బీర్‌ అలీ హెమాహెమీలున్నా.. కూడా ఇప్పుడు పోటీకి నో అంటున్నారు. మధుయాష్కీ ఇక్కడ నుంచి గతంలో రెండుసార్లు ఎంపీగా పోటీచేశారు. ఇప్పుడు మాత్రం నిజామబాద్‌ వద్దని అంటున్నారు. ఆయన చూపంతా ఇప్పుడు భువనగిరి మీద ఉందని టాక్‌. ఇక షబ్బీర్‌ అలీ కూడా నిజామాబాద్‌ అయితే వద్దు.. ఇస్తే జహీరాబాద్‌ లో అయితే పోటీ చేస్తానని అదిష్టానం వద్ద చెబుతున్నారు. అటు మాజీ మంత్రిసుదర్శన్‌ రెడ్డి ఇటీవల వరకు ఎంపీగా పోటీ చేస్తానని ప్రకటించారు. కానీ తీరా ఇప్పుడు ముఖం చాటేశారు. తాను రేసులో లేనని చెప్పారట. అయితే కాంగ్రెస్ నేత‌లు వెన‌క‌డుగు వేయ‌డానికి కార‌ణం ఇక్కడ TRS అభ్యర్థి క‌విత కావడమే. రాష్ట్రంలో టిఆర్ఎస్‌ హవా నడుస్తోంది. జిల్లాలో అసెంబ్లీ స్వీప్‌ చేసింది. అంతేకాదు.. కేసీఆర్‌ తన వారసురాలి విజయం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. అంతేకాదు.. కవిత కూడా జాతీయస్థాయిలో గుర్తింపు పొందారు. జిల్లాలో మైలేజీ సంపాదించారు. ఆమెకు జిల్లాలో తిరుగులేదన్న భావన ఉంది. ఆమె మెజార్టీ గురించి కేసీఆర్‌ పట్టుదలగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కవితను, అధికారపార్టీని తట్టుకుని ఇక్కడ గెలవడం కష్టమని నిర్దారణకు వచ్చారు. అంతేకాదు… ఇక్కడ పోటీచేయడం అంటే ఓటమిని కోరితెచ్చుకోవడమే.. డబ్బు వృథా చేసుకోవడమే అన్న భావన ఉంది. దీంతో ఇక్కడి నుండి పోటీ చేసి చేయి కాల్చుకునే కంటే.. సేఫ్ ప్లేస్ ను ఎంచుకోవ‌డం బేట‌ర్ అన్న భావ‌న‌లో ఉన్నారు కాంగ్రెస్ సీనియ‌ర్లు. ఆ ఒక్కటి తప్ప ఎక్కడైనా పోటీకి రెడీ అంటున్నారు. నిజామాబాద్‌ లో ఎవరిని రాజకీయ బలిస్తారో అంటూ కాంగ్రెస్‌ పార్టీలోనే ఆసక్తికర చర్చ జరుగుతోంది.