ఏపీ ప్రజలూ కేసీఆర్‌నే కోరుకుంటున్నారు

ఏపీ ప్రజలూ కేసీఆర్‌నే కోరుకుంటున్నారుటీఆర్‌ఎస్ పార్టీని ఆంధ్రప్రదేశ్‌
లో ఏర్పాటు చేయాలని అక్కడి ప్రజలు కోరుకుంటున్నారు. కేసీఆర్ లాంటి ముఖ్యమంత్రి తమకు ఉంటే బాగుండేదని పొరుగు రాష్ట్రం ప్రజలు కోరుకుంటున్నారని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. షాద్‌నగర్‌లో ఇవాళ మంత్రి కేటీఆర్ పర్యటించారు. పర్యటనలో భాగంగా మండల పరిషత్ కార్యాలయంలో ఆడిటోరియం నిర్మాణానికి, షాద్‌నగర్ మున్సిపాలిటీ భవన నిర్మాణానికి, 1700 డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణానికి కేటీఆర్ శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో కేటీఆర్ మాట్లాడుతూ.. ఇతర రాష్ర్టాల నాయకులు.. తెలంగాణ అభివృద్ధిని చూసి కొనియాడుతున్నారు. ఆంధ్రాకు చెందిన కొందరు ప్రజలు.. తమకు సీఎం కేసీఆర్ లాంటి నాయకుడు కావాలని కోరుకుంటున్నారు. టీఆర్‌ఎస్ పార్టీని కూడా ఆంధ్రాలో పెట్టండని అక్కడి ప్రజలు పిలుస్తున్నారు. కేసీఆర్ పాలనకు ఎంత జన ఆమోదం ఉందో దీన్ని బట్టి తెలుస్తుందన్నారు.
షాద్‌నగర్‌కు గొప్ప చరిత్ర ఉందన్నారు. 1952-56 వరకు హైదరాబాద్ రాష్ర్టానికి తొలి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు ఈ షాద్‌నగర్ వ్యక్తే అని గుర్తు చేశారు. 1956లో బలవంతంగా ఆంధ్రాలో తెలంగాణను కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాన్ని ఏర్పాటు చేశారు. సమైక్యాంధ్రలో దగాపడ్డ ప్రాంతం పూర్వపు పాలమూరు జిల్లా అని చెప్పక తప్పదన్నారు. అప్పర్ కృష్ణా ప్రాజెక్టు ద్వారా పూర్వపు పాలమూరు, కొంత నల్లగొండ జిల్లాకు నీళ్లు ఇచ్చేలా నాటి నిజాం రూపకల్పన చేశారు. ఆ సమయంలోనే బలవంతంగా తెలంగాణను ఆంధ్రాలో కలపడం వల్లే ఆ ప్రాజెక్టు కార్యరూపం దాల్చలేదు. దీంతో పాలమూరు జిల్లా అభివృద్ధికి నోచుకోలేకపోయింది. అప్పర్ కృష్ణా ప్రాజెక్టు పూర్తయి ఉంటే పాలమూరు మరో కోనసీమ అయి ఉండేదన్నారు. పాలమూరు గోసకు గత పాలకులే కారణమని కేటీఆర్ మండిపడ్డారు.
తెలంగాణ ఏర్పడితే మొత్తం చీకటి అయితదని అన్నారు. కానీ ప్రభుత్వం ఏర్పడిన మొదటి ఆరు నెలల్లోనే కరెంట్ సమస్యను అధిగమించామని తెలిపారు. వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నామని చెప్పారు. రూ. 5,600 కోట్లతో 43 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నాం. కాంగ్రెస్ పాలనలో మనిషికి నాలుగు కిలోలు.. ఇంటికి 20 కిలోల చొప్పున మాత్రమే రేషన్ బియ్యం ఇచ్చారు. టీఆర్‌ఎస్ పాలనలో మనిషికి ఆరు కిలోల చొప్పున.. ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మందికి ఆరు కిలోల బియ్యం ఇస్తున్నామని తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేశామన్నారు. సాగునీటి ప్రాజెక్టులను అడ్డుకునేందుకు చనిపోయిన వారి పేర్ల మీద కాంగ్రెస్ నేతలు కేసులు వేస్తున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Watch:

Recommended For You