ఇల్లు ఒల్లు గుల్ల‌య్యింది?

గెలిచిన  ఆనందమేది?
పాలేరు ఉప ఎన్నిక‌లో తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు గెలిచాడు. టిఆర్ఎస్ సంబ‌రాలు జ‌రుపుకుంటోంది. కానీ ఇది నిజంగా చెప్పుకోవాల్సిన స్థాయి విజ‌య‌మా? ప‌ండ‌గ జ‌రుపుకోవాల్సినంత ఘ‌న‌తా? ఏమాత్రం కాదు.. ఇక్క‌డ అభ్య‌ర్ధి గెలిచి ఉండొచ్చు కానీ పార్టీగా ఓడిపోయింది. పాలేరులో గెల‌వ‌డానికి అధికార పార్టీ న‌భుతో.. న‌భ‌విష్య‌త్తు అన్న‌ట్టుగా యుద్ధం చేసింది. 10 మంది మంత్రులు.. 40 మంది ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీలు, ఇంకా కార్పొరేట‌ర్లు, కార్పోరేష‌న్ల ఛైర్మ‌న్లు, పార్టీ నాయ‌కులు.. నామినేటెడ్ ప‌ద‌వులు ఆశించే రాష్ట్ర నాయ‌కులు ఒక్క‌రేమిటి వేల‌ల్లో ఇక్క‌డే మ‌కాం వేసి ప్ర‌త్య‌ర్ధుల‌పై పెద్ద యుద్ధ‌మే చేశారు. అధికార పార్టీ వ్యూహాలు చూసి ప్రధాన ప్ర‌త్య‌ర్ధికి అస‌లు డిపాజిట్టు ద‌క్కుతుందా అన్నంత‌గా ప్ర‌చారం జ‌రిగింది. ఇంత చేసినా వ‌చ్చిన  మెజార్టీ తెలిసిందే. వాస్త‌వానికి సాధించిన విజ‌యం ప‌ట్ల తుమ్మ‌ల కూడా సంతృప్తిగా క‌నిపించ‌లేదు. మీడియా ముందుకు వచ్చిన ఆయన ముఖంలోనూ అస‌హ‌నం కనిపించింది. త‌న మానాన త‌న‌ను వ‌దిలేస్తే జిల్లా పార్టీని పెట్టుకుని వెయ్యో, రెండువేల మెజార్టీతో గెలిచినా గౌర‌వంగా ఉండేది.. కానీ అధిష్టానం అత్యుత్సాహం కార‌ణంగా ఇలా నైతికంగా ఓటమిపాలు కావాల్సి వ‌చ్చిందన్న బాధ జిల్లా పార్టీ నాయకుల్లో వ్యక్తమవుతోంది.
తుమ్మ‌ల‌కు గెలిచిన ఆనందం ఎలాగూ లేదు. ఆయ‌న అనుచ‌రుల్లోనూ సంతృప్తి లేదు. అధిష్టానం చేసిన హ‌డావిడి చూసి కోట్లు పందాలు కాసిన‌వారంతా ఇల్లు ఒల్లు గుల్ల చేసుకున్నారు. 50వేల మెజార్టీ వస్తుందని భావించి కోట్ల‌ రూపాయల్లో పందేలు కాశారు. నిండా మునిగారు. ఇలా జిల్లాలో ఎవ‌రికి విజ‌యం ఊపు ఇవ్వ‌డం లేదు. అటు ప‌రువు పాయా? ఇటు డ‌బ్బు పాయా అని కొంద‌రు  నేతలు బ‌య‌ట‌కు రావ‌డం మానేశారు.

Recommended For You

Comments are closed.