ఆ కంపెనీ కార్లు కొనవచ్చా?

భారతదేశంలో ఫోర్డ్‌  కార్ల కంపెనీ చాలాకాలంగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. అమెరికాకు చెందిన ఈ కంపెనీకి ప్రపంచవ్యాప్తంగా మంచి పేరుంది. కనీస ప్రమాణాలు పాటించడంతో పాటు ప్రయాణీకుల భద్రత విషయంలో చాలాజాగ్రత్తలు తీసుకుంటోంది. అయితే భారతదేశంలో మాత్రం ఈ కంపెనీ ఆశాజనకంగా అమ్మకాలు సాగించలేకపోతోంది. ప్రస్తుతం ఫిగో, యాస్పైర్‌, ఎండీవర్‌ వంటి మోడల్స్‌ దేశంలో విక్రయిస్తోంది. స్పోర్ట్స్‌ విభాగంలో ఖరీదైన జీటీ మోడల్‌ కూడా ఉంది. అయితే వినియోగదారులు మాత్రం కంపెనీ పట్ల కొంత అపనమ్మకంతో ఉన్నారు. దేశీయ మార్కెట్‌ నుంచి కంపెనీ సేవలు నిలిపివేస్తుందన్న ఆందోళన ఉంది. దీనికి అనేక కారణాలున్నాయి. భారతీయ మార్కెట్లో దీని వాటి చాలాతక్కువగా ఉంది. పైగా వ్యయం అధికంగా ఉంది. కంపెనీ పెద్దగా లాభాలు ఆర్జించలేకపోతోంది. వేల కోట్ల పెట్టుబడులు పెట్టినా అమ్మకాల్లో ఆశించిన స్తాయిలో వృద్ధి  చూపించలేకపోతుంది. దీంతో దేశంలో కార్యకలపాలు మూసివేస్తుందన్న చర్చ మొదలైంది. అమెరికాకే చెందిన జనరల్‌ మోటార్స్‌ కూడా ఇదే తరహాలో మార్కెట్లో నిలదొక్కుకోలేక మూతపడింది. దీంతో ఫోర్డ్‌ పట్ల కూడా భయాలు కూడా పెరిగాయి.
Watch Video:

అయితే ఫోర్డ్‌ తనపై ఉన్న ముద్ర తొలగించుకుని సరికొత్త వ్యూహంతో వచ్చింది. వాహన రంగంలో అతిపెద్ద దేశీయ కంపెనీ అయిన మహీంద్రాతో ఒప్పందం చేసుకుంది. ఉత్పత్తి, సర్వీస్‌ రంగాల్లో పరస్పర సహకారంతో ముందుకెళ్లాలని నిర్ణయించాయి. దీంతో దేశవ్యాప్తంగా అతిపెద్ద నెట్‌ వర్క్‌ ఉన్న మహీంద్రాలోనే ఫోర్డ్‌ సర్వీసులు కూడా అందుతాయి కాబట్టి కంపెనీకి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. అమ్మకాలపై పాజిటీవ్‌ ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా తమ వినియోగదారుల్లో నమ్మకం కల్పించేందుకు దోహదపడుతుందని నమ్ముతోంది. భారతదేశం తమకు అత్యంత వ్యూహాత్మక మార్కెట్‌ అని.. ఇక్కడి నుంచి వెళ్లే అవకాశం లేదని చెబుతోంది. పైగా ఎలక్ట్రిక్‌ వాహన రంగంలో రెండు కంపెనీలు భారీ ఆశలు పెట్టుకున్నాయి. కాబట్టి మరిన్ని పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది. మొత్తానికి ఫోర్డ్‌ కొనాలనుకుంటున్న వినియోగదారులు ఎలాంటి సందేహం లేకుండా.. కంపెనీ మూతపడుతుందన్న భయం వదిలేసి హ్యాపీగా కొనొచ్చంటున్నారు నిపుణులు.

Recommended For You