అమ్మో ఆ ఎమ్మెల్యేలా?

పార్టీకే తలనొప్పిగా మారారా?

ప్ర‌జాప్ర‌తినిధులకు అధికారాల‌ను ఇవ్వాల‌నుకోవ‌డంలో త‌ప్పు లేదు. వారి ఉనికికి భంగం క‌ల‌గ‌కుండా ఉండాల‌నుకోవ‌డం అంత‌క‌న్నా నేరం కాదు. కానీ అలా ఇచ్చిన‌ స్వేఛ్చ‌ పార్టీ వినాశ‌నం కోరేలా ఉండ‌కూడ‌దు. తెలంగాణలో అధికార పార్టీలో అదే జ‌రుగుతోంది. విప‌రీతాల‌కు దారితీస్తోంది. ముఖ్య‌మంత్రి ఇచ్చిన స్వేఛ్ఛ‌ను, స‌ర్వాధికారాల‌ను ఎమ్మెల్యేలు దుర్వినియోగం చేస్తున్నారు. పార్టీని బ‌జారున పెడుతున్నారు. సుమారు 10 నుంచి 20 మంది ఎమ్మెల్యేలు త‌మ తీరుతో పార్టీని, క్యాడ‌ర్‌ను ఇబ్బందుల పాలు చేస్తున్నారు. నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీ నాయ‌కులు కూడా తిర‌గ‌లేని ప‌రిస్థితికి కార‌ణ‌మ‌వుతున్నారు. విచిత్రం ఏమంటే బాధితుల్లో ఎంపీలు, మంత్రులు కూడా ఉండ‌డ‌మే. నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎమ్మెల్యేలే సుప్రీం వారిదే తుది నిర్ణ‌యం అన్న మాట‌లు కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీకి సంస్థాగ‌తంగా స‌మాధి క‌డుతున్నాయి. పార్టీ బ‌ల‌హీన‌ప‌డ‌టానికి కార‌ణ‌మ‌వుతున్నాయి.

సిఎం సొంతం జిల్లా మెద‌క్‌లోని ఆంథోల్ నియోజ‌వ‌క‌ర్గంలో ప‌రిస్థితి దారుణంగా ఉంది. ఎమ్మెల్యే బాబూమోహ‌న్‌ను కాద‌ని నియోజ‌క‌వ‌ర్గంలో అడుగుపెట్ట‌డానికి నాయ‌కులే కాదు.. చివ‌ర‌కు మంత్రులు, ఎంపీలు కూడా వ‌ణుకుతున్నారట‌. ఇటీవ‌ల ఎంపీ బీబీ పాటిల్ ఆంథోల్ నియోజ‌క‌వ‌ర్గంలో ఓ అభివృద్ది కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. అప్ప‌టికే ఆగ్ర‌హంతో ఊగిపోతూ వ‌చ్చిన బాబూమోహ‌న్ త‌న‌కు స‌మాచారం ఇవ్వ‌కుండా నా నియోజ‌క‌వ‌ర్గంలోకి ఎలా వ‌స్తారంటూ వేదిక మీద‌నే ఎంపీపై మండిప‌డ్డారు. భ‌విష్య‌త్తులో త‌న‌కు స‌మాచారం ఇవ్వ‌కుండా రావొద్ద‌ని క‌టువుగానే చెప్పార‌ట‌. దీంతో అవాక్కు అయిన కార్య‌క‌ర్త‌లు ముక్కుమీద వేలు వేసుకున్నారు. అంద‌రిముందు ఎంపీకి త‌ల‌కొట్టేసిన‌ట్టు అయిందట‌. కార్య‌క‌ర్త‌లు పిలిస్తే వ‌చ్చినా రాద్దాంతం చేయ‌డంపై ఆయ‌న దిగాలుప‌డ్డారు. ఆంథోల్ నియోజ‌క‌వ‌ర్గంలో అడుగుపెట్టాలంటే బాబూమోహ‌న్ ఇచ్చే వీసా కావాలా అని అక్క‌డివారు గుస‌గుస‌లాడారు. ఇటీవ‌ల హ‌రిత‌హారంలో కూడా ఎంపీ పాల్గొన‌డానికి వెన‌కాడిన‌ట్టు పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఎంపీనే కాదు.. నియోజ‌క‌వ‌ర్గంలో ఇత‌ర నేత‌లు కూడా స‌మాచారం ఇవ్వ‌కుండా మీటింగులు పెడితే బాబూమోహ‌న్ తిట్ల దండ‌కాన్ని భ‌రించాల్సి వ‌స్తుంద‌ట‌. ఆయ‌న అగ్గిమీద గుగ్గిలం అవుతున్నార‌ట‌. చివ‌ర‌కు ఎమ్మెల్యే తీరుతో విసిగిన నియోజ‌క‌వ‌ర్గ‌ నేత‌లంతా పార్టీలో మ‌రోగ్రూపుగా ఏర్ప‌డ్డారు.పార్టీ వీడటానికి కూడా సిద్ద‌మ‌వుతున్నార‌ట‌.

అటు ఖ‌మ్మం జిల్లాలోనూ ఇదే ప‌రిస్థితి. వైరా నియోజ‌క‌వ‌ర్గంలో ఎమ్మెల్యే మ‌ద‌న్‌లాల్ పేరు చెబితేనే జిల్లా నాయ‌కులు హ‌డ‌లిపోతున్నారు. అనుచ‌రుల అరాచ‌కాలు అంతులేకుండా పోతోందట‌. గ‌తంలో మంత్రి తుమ్మ‌ల ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా వైరాలో నాయ‌కులు ప్లెక్సీలు పెడితే ఎమ్మెల్యే ఫోటో లేదంటూ కార్య‌క‌ర్త‌ల‌ను ఎమ్మెల్యే అనుచ‌రులు ఊరికించి చిత‌క‌బాదారు. కొణిజ‌ర్ల‌, జూలురుపాడు మండ‌లాల్లో అయితే కొందరిపై త‌ప్పుడు కేసులు కూడా పెట్టించిన‌ట్టు ఆరోప‌ణ‌లున్నాయి. పార్టీలో గ్రూపు రాజ‌కీయాల‌కు తావు ఇచ్చిన‌ట్టు ఉంటుంద‌ని మంత్రి తుమ్మ‌ల కూడా వైరా నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించ‌డానికి ఇటీవ‌ల‌ వెన‌కాడుతున్నారు. ఇక లాభం లేద‌నుకుని ఎంపీ శ్రీ‌నివాస‌రెడ్డి మాత్రం ఇటీవ‌ల స‌మీక్ష‌లు చేస్తున్నారు. అయినా ఎమ్మెల్యే స‌మాచారం ఇచ్చినా ఈ స‌మ‌వేశాల‌కు రావ‌డం లేదు. అభివృద్ధి లేక‌పోయినా ఈ నియోజ‌క‌వ‌ర్గంలో అక్ర‌మ కేసుల‌కు కొద‌వ‌లేద‌ట‌.

క‌రీంన‌గ‌ర్‌, వ‌రంగ‌ల్ జిల్లాల్లో కూడా మూడు నియోజ‌క‌వ‌ర్గాల్లో ఇదే ప‌రిస్థితి. అటు నిజిమాబాద్‌, ఆదిలాబాద్ జిల్లాలో కొంద‌రు ఎమ్మ‌ల్యేల తీరుపై ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి.  ఎమ్మెల్యేలు సుప్రీం అన్న కేసీఆర్ మాట‌ల‌కు వారు అర్ధం మార్చేస్తున్నారు. అభివృద్ధి ప‌నుల నిర్ణ‌యాల్లో, సంక్షేమ ప‌థ‌కాల‌కు ల‌బ్ధిదారుల ఎంపిక‌లో నిర్ణ‌యాలు తీసుకోమ‌ని వారికి అధికారాలు క‌ట్ట‌బెట్టారు. దీనినే నియంతృత్వంగా భావించి పార్టీ ప‌రువును బ‌జారున పెడుతున్నారు. క‌నీసం జిల్లా మంత్రుల‌కు కూడా విలువ ఇవ్వ‌డం లేదు. ఎంపీల‌ను  అస‌లే ప‌ట్టించుకోవ‌డం లేదు. 

అంతుకుముందు ఎమ్మెల్యేల ప‌నితీరుపై సిఎం స‌ర్వే చేయించారు. ఇందులో అట్ట‌డుగున ఉన్నఎమ్మెల్యేలే పార్టీ బ‌లోపేతం కాకుండా గ్రూపు రాజ‌కీయాల‌తో ప్ర‌తిబంధ‌కంగా మారిన‌ట్టు అధిష్టానం వ‌ర్గాలు అంచ‌నాకు వ‌చ్చాయి. అయితే ఇప్పుడు వారిపై క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించ‌డం కంటే.. ప‌నితీరు మార్చుకుంటే టికెట్ లేదంటూ ఇంటికే అన్న‌ట్టు కేసీఆర్ సంకేతాలు ఇచ్చారు. అయినా వారిలో మార్పు రాలేద‌ని నిర్ణ‌యానికి వ‌చ్చారు.  ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీకి న‌ష్టం జ‌ర‌గ‌క‌ముందే ముఖ్య‌మంత్రి ఎలాంటి సంకేతాలు ఇస్తారో చూడాలి.

Recommended For You

Comments are closed.