అధికారంలోకి వస్తే చిత్తూరు జిల్లాలో జగన్‌ కు సెగ తప్పదా?

అధికారంలోకి వస్తే చిత్తూరు జిల్లాలో జగన్‌ కు సెగ తప్పదా?వైసీపీ అధికారంలోకి వస్తుందని జగన్‌ సహా పార్టీ వర్గాలు ధీమాగా ఉన్నాయి. తమదే అధికారం అన్నట్టుగా సోషల్‌ మీడియాలో పార్టీ ప్రచారం చేసుకుంటోంది. కేబినెట్‌ కూడా ఇదేనంటూ ప్రచారం జరుగుతోంది. ఒకవేళ వైసీపీ అధికారంలోకి వస్తే చిత్తూరు జిల్లా జగన్‌ కు చుక్కలు చూపించడం ఖాయమంటున్నారు. కేబినెట్‌ పదవుల విషయంలో సమస్యలు తప్పవంటున్నారు. జిల్లాలో హెమాహెమీలున్నారు. వారంతా గెలిస్తే మంత్రి పదవి రేసులో ఉంటార. ఎవరికివ్వాలన్నది జగన్‌ కు కత్తిమీదసామే. పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి, కరుణాకర్‌ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి, రోజా, చింతల రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి ద్వారకానాథ్‌ రెడ్డి ఇలా సీనియర్లంతా ఈ జిల్లాలోనే ఉన్నారు. వీరంతా పార్టీకి మొదటి నుంచి అండగా ఉన్నారు. ఎవరినీ కాదనలేని పరిస్థితి. వీరంతా ఒకే సామాజికవర్గానికి చెందిన నాయకులు. దీంతో ఎవరికి అవకాశం ఇవ్వాలి..? మరెవరిని పక్కనపెట్టాలన్నది జగన్‌ కు సవాలే అంటున్నారు. పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి పార్టీలో కీలకంగా ఉన్నారు. పార్టీలో సీనియర్‌ ఎమ్మెల్యే… పుంగనూరు నుంచి వరసగా గెలుస్తున్నారు. అత్యంత సీనియర్‌ నాయకుడు.. అధికారంలోకి వస్తే ఆయనకు కీలక మంత్రి పదవి ఖాయమన్న చర్చ ఉంది. ఇక చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి కూడా గెలిస్తే మంత్రి అవుతానంటూ చంద్రగిరి నియోజకవర్గంలో ప్రచారం చేసుకున్నారు. అటు నగరి నుంచి పోటీచేసిన రోజా కూడా గెలిస్తే మహిళా కోటాలో తన చిరకాల అమాత్య పదవి కోరిక తీరడం ఖాయమన్న ధీమాలో ఉన్నారు. ఇక తిరపతి నుంచి బరిలో దిగిన భూమన కరుణాకర్‌ రెడ్డి కూడా జగన్మోహన్‌ రెడ్డికి ఆంతరంగికుడు.. పార్టీ విధాన నిర్ణయాల్లో ముఖ్యమైన నాయకడు. ఆయన్ను కాదంటారా? ఇలా ఎవరికి వారే సీనియర్లు.. జగన్‌ కు అత్యంత సన్నిహితులు.. దీంతో పార్టీ అధికారంలోకి వస్తే జగన్‌ కు చిత్తూరు జిల్లాలో పదవుల పంపకం సవాలే అంటున్నారు. మరి ఈ జగన్‌ అధికారంలో వస్తే.. ఈ సమస్యను ఈజీగానే అధిగమిస్తారా? చూడాలి.

Recommended For You